Sri Bhagavadgeetha Madanam-1 Chapters
5. శ్రీ మహాభాగవత
భక్తి యోగరహస్యము
నిన్నెట్లారాధించేదిరా :
భగవతత్త్వ నిర్ణయా నంతరము, ''నిన్నెట్లారాధించేదిరా''? అను ప్రశ్నకు సమాధానముగా భక్తి యోగమును విచారింపవలయును భగవంతుని భక్తితో ఆరాధించవలెను. ''భక్త్యా భాగవతం జ్ఞేయమ్'' భక్తి భావముతోనే వాఙ్మయావతారమై భాగవతమును గ్రహింపనగును. భగవద్గీతలో శ్రీకృష్ణుడు
శ్లో|| భక్త్యాత్వ నన్యయా శక్య మహమేవం విధో೭ర్జున
జ్ఞాతుంద్రష్టుంచ తత్త్వేన ప్రవేష్టుంచ పరంతప!
భగవద్గీత 11-53
నన్ను జూచుటకుగాని తెలసికొనుటకుగాని నాయందు ప్రవేశించుటకు గాని నిశ్చలభక్తితప్ప వేరు సాధనములు లేవు'' తెలిపెను.
శ్లో|| పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వ నన్యయా
భగవద్గీత 8-12
పరమ పురుషుడగు నేను ఏకాంత భక్తిచే పట్టు పడుదును.
శ్లో|| అసన్య చేత స్సతతం యోమాం స్మరతి నిత్యశః
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్త స్సయోగినః
భగవద్గీత8-12
ఇతర చింతలు లేక ఎవడు నన్ను సర్వకాలసర్వావస్థల యందును తలచునో అట్టి నిత్యయోగికి నేను చిక్కుదును.''
అందులకే పరమభాగవతుడగు ప్రహ్లాదుడు
శా|| పానీయంబుల ద్రావుచున్, గుడుచుచున్, భాషింపుచున్, హాసలీ
లా నిద్రాదులు సేయుచుం, దిరుగుచున్, లక్షించుచున్, సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతు డేతద్విశ్వమున్ భూవరా !
భాగవతము 7-123
భాగవతములో భక్తి స్థానము :
భగవద్గీతలో 12వ దగు భక్తి యోగాధ్యాయమున భక్తి శబ్దము యోగశబ్దముచే కలిపి ప్రయోగింపబడలేదు. గీతలో 14-26 శ్లోకములో ''భక్తియోగ'' మను శబ్దసమ్మేళన ప్రయోగము కనుపించుచున్నది.
శ్లో|| మాంచ యో7 వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే
సగుణాన్ సమతీత్యై బ్రహ్మభూయాయ కల్పతే.
గీత 14-26
ఎవడితర దేవతాచింతనము లేక భక్తియోగములతో నన్నుసేవించునో అట్టి వాడు త్రిగుణుల నతిక్రమించి ముక్తిని బొందుటకు సమర్ధుడగును.
కర్మయోగము, సాంఖ్యయోగము ఈ రెండే (వురాప్రోక్తామయానఘ)కృష్ణ పరమాత్మచే పూర్వము చెప్పబడినది. భక్తి, జ్ఞాన ప్రాప్తికి సాధనమని సూచింపబడినది. (భక్త్యాజ్ఞానం ప్రజాయతే) యోగమనగా ముక్తి మార్గము. కాని భక్తికి యోగస్థానము నిచ్చి భాగవతము దానిని ముక్త మార్గముగా జేసినది. నిష్కామ కర్మమార్గము కర్మసన్యాసముకంటె ఉత్తమమని (కర్మసన్యాసాత్ క్రమయోగోశిష్యతే) భగవద్గీతలో తెలుపగా, భక్తి మార్గమును దప్ప ఇతర భక్తిదములైన మార్గములను భాగవతులు పాటింపరని భాగవతము సూచించుచున్నది.
క|| యుక్తి దలప, భవద్వ్యతి
రిక్తములైనట్టి ఇతర దృఢ కర్మంబుల్
ముక్తి దములైన, నీపద
భక్తులు తత్కర్మములను బాటింపరిలన్.
భాగవతము 3-547
శ్రీహరి లీలలను గ్రహించుటకు కూడ భక్తి అవసరమని భాగవతము ముందుగనే పాఠకులను హెచ్చరించినది.
ఉ|| ఇంచుకమాయ లేక మదినెప్పుజడు బాయని భక్తితోడ వ
ర్తింపుచు నెవ్వడేని హరిదివ్య పదాంబుజ గంధారసి సే
వించు, నతం డెరుంగు నరవింద భవాదులకై దుర్లభో
దంచితమైన యాహరి యుదార మహాద్భుత కర్మమార్గముల్
భాగవతము 1-71
దేవగీతలో భక్తిచేకామము నశించునని చెప్పబడినది.
శ్లో|| ప్రోక్తేన భక్తి యోగేన భజతో మాం సకృన్మునే
కామా హృదీయా నశ్యంతి సర్వే మయి హృది స్థితే ||
-దేవీగీత
నేను చెప్పిన భక్తిమార్గమున నన్ను ఒకమారైనను భజించుచున్న యోగికి నేను హృదయమం దుండగా వాని హృదయమునందలి కామములన్నియు నశించుచున్నవి. ''ఇంకను నారద భక్తి సూత్రములయందు '' సాతు కర్మజ్ఞాన యోగేభ్యో೯ప్యధికతరా'' భక్తి యోగము కర్మజ్ఞాన యోగములకంటె శ్రేష్ఠమని శ్లాఘింపబడినది. పై విధముగ భక్తి యోగముయొక్క ప్రాధాన్యత ఆవశ్యకత నిరూపింపబడినది.
భక్తి యోగము రహస్యమా:
భాగవత భక్తి తత్త్వము ఒక మర్మమని భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు తెలిపెను.
''చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ'' భాగ 7-166
భాగవతమును రచింపుమని వ్యాసు నాదేశించునప్పుడు స్వానుభవమును పురస్కరించుకొని నారదుడు ''నాదు శరీర జన్మకర్మముల రహస్యమెల్ల మునిమండన!
చెప్పితి నీవు గోరినన్''
భాగవతము 1-132
అతని రజస్తమోపరిహారిణి యగు భాగవతభక్తి రహస్యమును తెల్పెను.
భక్తి రహస్యమును దెలుపు వృత్రాసురవధ కూడ రహస్యమైన అంతరార్ధము కలిగియున్నదని ఆ రహస్యమును ఋషులవలన తెలిసికొంటినని వ్యాసుడు భారతమున తెలిపెను. చిత్రకేతూపాఖ్యానమున దీని ముందు వివరింతును. కావున భాగవత భక్తితత్త్వమొక రహస్య మని నేను వ్రాసితిని. ఈ రహస్యము
''ఇంద్రియంబు లీశ్వర విషయంబులైన
మది సంచిత నిశ్చల తత్త్వమైనచో
సరసిజనాభు కీర్తనమె చాలు విపద్దశలన్ జయింపగన్
భాగవతము - విదురమైత్రేయ సంవాదము 3-242
అను వచనములలో నిమిడియున్నదని ముందు నిరూపింతును.
భక్తి నిర్వనచమేమి ?
''భజనసేవాయాం'' వాఙ్మనః క్రియలతో భగవంతుని సేవించుటయే భక్తి
శ్లో|| దృతస్య భగవద్ధర్మా ర్ధారావాహికతాం గతా
సర్వేశే మనసో వృత్తిః భక్తిరి త్యభిధీయతే
పరమేశ్వరుని ఎల్లప్పుడు స్మరించుటచేత ద్రవించిన చిత్తముతో ఏకధారగా నున్న ఏకాకార చిత్తవృత్తియే భక్తి - భక్తిరసాయనము
భాగవతమునందు ''భక్తి విశేషము'' ''అచ్చపుభక్తి'' ఇత్యాది ప్రయోగములు గలవు, మహాకవియైన పోతన ఉపయోగించిన ''విశేషము'' ''అచ్చపు'' అను పదములు కేవల పాద పూరణమునకు గాక సాభిప్రాయముగా వాడబడెనని భావించవలెను. ఈవిశేషభక్తియే అభేదము అనన్యము అగు ఆత్యంతిక భక్తిగా భాగవతమున నిరూపింపబడినది.
శంకర భగవత్పాదులు ''మోక్షసాధన సామగ్ర్యా భక్తి రేవగరీయసి'' అనగా మోక్షసాధనకు భక్తియోగము శ్రేష్ఠమైనదని తెలిపిరి. కాని శంకరులు వివేక చూడామణిలో భక్తిని నిర్వచించునపుడు ఆత్మానాత్మ విచారముతో జ్ఞానమార్గము నవలంబించు వారికి అన్వయించునట్లు నిర్వచించిరి. ''స్వస్వ రూపాను సంధానం భక్తి రిత్య భిధీయతే'' అనగా తా నెవరని తెలిసికొను ప్రయత్నమే భక్తి. కాని భాగవతములో తెలిపిన ''భక్తి విశేషము'' నారద భక్తి సూత్రములలోని నిర్వచనము ననుసరించు చున్నదనుట సమంజసముగా నుండును. పై భక్తి సూత్రములలో భక్తి ''పరమ ప్రేమ రూపా'' అని నిర్వచింపబడినది. దీనినె ''పరాభక్తి'' యందురు. ఏకోరికలేక కేవలము భగవంతుని ముందుగల ప్రేమయే భక్తి యనబడును. ఈ అభిప్రాయమే శాండిల్యకి సూత్రములయందు వ్యక్తము చేయబడినది.
''సా పరానురక్తి రీశ్వరే'' ఈశ్వరుని యందు నిరతి శయప్రేమయే భక్తి. భాగవతమున
''అహేతుక్య వ్యవహితా యాభక్తిః పురుషోత్తమె''
భాగవతము 3-29-12
అనగా నిర్హేతుకము, నిష్కామము, నిరంతరము నైన ప్రేమ భక్తియని నిర్వచింపబడినది.
ఇను మయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంత
మగు హృషీకేశు సన్నిధి నా విధమున
కరగుచున్నది దైవ యోగమున జేసి
బ్రాహ్మాణోత్తమ! చిత్తంబు భ్రాంతమగుచు.
భాగవతము 7-149
ఇనుము అయాస్కాంతమునే లాగబడునట్లు భక్తుడు భగవంతునియందే మనస్సును లగ్నము చేయును. ఇట్లు పరమేశ్వరుని యందు లగ్నమైన మనస్సును క్రింది ఉపమానములతో శంకరుడు వివరించెను.
శ్లో|| అంకోలం నిజబీజ సంతతి, రయస్కాంతోపలం సూచికా,
సాధ్వీనైజవిభుం లతాక్షితిరుహం సింధుస్సరి ద్వల్లభమ్
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవింద ద్వయం
చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సాభక్తి రిత్యుచ్యతే ||
--------శివానందలహరి
రాలిన ఊడుగ గింజలు మరల చెట్టును చేరును. సూదంటురాయిని ఇనుపసూది చేరును.పతివ్రత అగు స్త్రీ తన పతని చేరును. లతలు వృక్షమును పెనవేసికొనును, నదులు సముద్రునిచేరును, ఈ విధముగనే ఎవ్వని చిత్తవృత్తి పరమేశ్వరుని యందు లగ్నమగునో అట్టి చిత్తవృరత్తిని భక్తి యందురు.
ఇట్టి భక్తుడు తానేదియు పరిగ్రంహింపడు. సర్వమును ఈశ్వరున కర్పణ సేయును.
''మాం మదీయంచ హర యేతే సమర్పయేత్''
నన్ను నా సర్వస్వమును భగవంతున కర్పణ జేసితిని పూజా వసానమున భక్తుడు దేవతార్చనయందు తెలుపుచున్నాడు. భక్తుడు ఐహికసుఖములనేకాక మోక్షమునుకూడ ఆశించడు. ఎందుకనగా
''నిర్హేతుకమైన భగవత్సేవ ముక్తికంటె గరిష్ఠంబు''
చ|| అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవిందయు
గ్మము హృదయఁబునన్ నిలిపి, కౌతుకులై ఇతరేతరాను లా
పముల మదీయ దివ్యతను పౌరుషముల్ గొనియాడు చుండి, మో
క్షము మది గోరనొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై.
భాగవతము 3-878
అందులకే భాగవతములోని భక్తి యోగము ''భక్తి ప్రధాన ఏకేశ్వరోపాసనాద్వైత తత్త్వవిశిష్ట మగు నిష్కామ కర్మయోగమని'' ఒక కవిత్వమేది నిర్వచించెను. భక్తి ''తసై#్మవాహమ్'' నేనతని వాడ ననుభావముతో ప్రారంభ##మై ''మమైనా సౌ'' నీవు నావాడని అనగా భగవంతుడు తనవాడని భావించి తుదకు ''త్వమేవాహమ్'' నేనే నీవను అద్వైత సిద్ధితో పరిసమాప్త మగును. ''తస్మిన్‌స్తజ్జనే భేదాభావాత్'' భగవంతునియందు భక్తి నియందు భేదభావములేకుండుటయే పరాభక్తియని ఒక నిర్వచనము. ప్రారంభదశయందు భక్తి ఉపానవ ఒక్కటియే. భక్తుడు భగవంతునిగూర్చి చింతించుచు ''అపహృత మనఃప్రాణుడై'' పరాభక్తి స్థితిని పొందును. బాహ్యపదార్థమును బ్రహ్మభావనతో చింతించుట ప్రతీకోపాసన యగును. పదార్థదృష్టి తొలగింపబడిన అది అహంగ్రహోసాసన యగును. అనగా నిజరూపమును బ్రహ్మముగా భావించి చింతించుట అనగా స్వస్వరూప అనుసంధానము అనవచ్చును. అందువలన సగుణోపాసన సాధనము నిర్గుణోపాసన సాధ్యము తుదకు నిర్గుణోపాసన సిద్ధించుటచేత సగుణోపాసనము నిందించరాదు.
శ్రీ ఎస్. రాధాకృష్ణన్ గారు భక్తికి చక్కని నిర్వచన మిట్లు తెలిసిరి.
1) A loving attachment to god.
2) A profound experience which negates all desires and fills the heart with love for God.
భగవదనుగ్రహము పొందుటకు భక్తున కుండవలసిన అర్హతలు:
భగవదనుగ్రహము పొందుటకు భక్తునకు ప్రత్యేక అర్హతలు గాని, అధికారములు కాని, యోగ్యతలుగాని అవసరములేదు.
''నాస్తితేషు జాతివిద్యారూప కులధన క్రియాదిభేదః''-నారద భక్తి సూత్రములు, భక్తులలో కులమత వివక్షతలేదు.అందులకే ''యోమద్భక్తః సమేప్రియః'' అని శ్రీకృష్ణుడు తెలిపెను. ''ఎవడు నాకు భక్తుడో వాడు నాకు ప్రియుడు''.
1) వయస్సు కారణముకాదు:- బాలుడైన ధృవుడు, ఐదేండ్లుగల ప్రహ్లాదుడు, ముదుసలియైన శబరి భగవధనుగ్రహమునకు పాత్రులైరి.
2) కులము కారణముకాదు:- శ్రీకృష్ణుడు శూద్రుడైన విదురుని అతిథ్యమును స్వీకరించి క్షత్రియుడైన దుర్యోధను డొసగు విందును నిరాకరించెను. అగ్రజన్మయు కారణముకాదు. రావణుడు బ్రహ్మణుడయ్యును రామునిచే చెంపబడెను.
ఉ|| ఎంతటి పుణ్యమో శబరి యెంగలిగొంటివి, వింతగాదె, నీ
మంతన మెట్టిదో యుడుతమేని కరాగ్ర నఖాంకురంబులన్
సంతసమంద జేసితివి సత్కుల జన్మము లేమిలెక్క
-దాశరథీ శతకము
3) చదువు కారణముకాదు:- గజేంద్రుడు మొరపెట్టగా శ్రీహరియతనిని కాపాడెను. (ఏ వేదంబు పఠించె లూత?)
4) జన్మ కారణము కాదు:- మృగములు కూడ హరిభక్తిచే తరించినవి.
5) #9; రూపము కారణముకాదు:- కురూపియగు కుబ్జ అనుగ్రహింపబడినది.
6) ధనము కారణముకాదు:- పేదపారుడైన కుచేలుడు భక్తితో నొసగిన అటుకులు తిని శ్రీకృష్ణుడతనిని అనుగ్రహించెను.
7) పౌరుషముకారణముకాదు:- కంసుని తండ్రియగు ఉగ్రసేనుడు మోక్షమును పొందెను.
పై విధముగా భక్తి యోగముచే భగవంతుని అనుగ్రహము పొందుటకు ఏ అర్హతయు అవసరము లేదు. ఇతర యోగములకుతగిన అర్హతలు కావలెనని తర్వాత ఆయా యోగములలో నిరూపింపబడును.
ఒక పరదేశీయుని భక్తి భావము:
ఏదేశ భక్తుడైనా భక్తుని భావ మొక్కటిగనే యుండును. భాతవత భక్తి భావము ఒక అనామక అంగ్లేయ రచనలో నాకు గోచరించినది. ''Once it was constant drifting now my anchors cast'' ఒకప్పుడు అనేక పద్దతులలో అనేక దేవతలను కొలుచుచుంటిని. ఇప్పుడు సర్వ దేవతలు ఆదినారాయణుని అంశ##లేనని గ్రహించిన నాకు ఏకాగ్రత కుదిరినది. (అభేదభక్తి)
''Once his gifts I wanted now the giver own''
ఒకప్పుడు నేను వరములను కోరితిని. ఇప్పుడు భగవంతునే పొందవలెనని నా కోరిక. (నిష్కామము) అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను యుద్ధమున సహాయముగా కోరెను. కాని దుర్యోదనుడు శ్రీకృష్ణుని సైన్య సహాయము కోరెను.
''Once I sought for heeting, now himself alone''
ఒకప్పుడు నాఅనారోగ్యము బాగుచేయుమని కోరితిని. ఇప్పుడు భగవంతునే పొందగోరుచున్నాను.
''Once it was anxious caring. Now He has the care.''
ఒకప్పుడు నా యోగక్షేమములకై కష్టించితిని, నేనతని శరణుపొందిన తరువాత నా యోగక్షేమములు దేవుడే వహించుచున్నాడు. (అనన్యాశ్చింతయంతో మాం)
''Once it was ceaseless holding, now He holds me fast''
ఒకప్పుడు నేను దేవుని వదలక సేవల నొనర్చి కాపాడుమని వేడుకొంటిని.ఇప్పుడు ఆత్మార్పణ బుద్ధితో నా సర్వమతనికి సమర్పించి భారమతనిపై వైచినప్పుడు అతడే నన్ను వదలక కాపాడుచున్నాడు.
పై భక్తుని వాక్యములలో కోరికలు మాని ఆత్మార్పణబుద్ధితో శరణాగతుడై భారము దేవునిపై వైచిన ఎడల భగవంతుడే భక్తుని వదలక ఏమరక కాపాడునని సూచింపబడినది. ఇది భాగవత భక్తి తత్త్వమేకాని వేరుకాదు.
శ్లో|| అనన్యాశ్చింతయంతో మాం మే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం మహా మ్యహమ్ ||
భగవద్గీత 9-22
ఇతర చింతలు లేక ఏ జనులు నన్ను చింతించుచు సేవించుచున్నారోఅట్లు నిత్యమును నన్నే గతిగాతలంచిన యా జనులయొక్క యోగక్షేమములను నేనే వహించుచున్నాను.
మోక్షసాధనకు భక్తి అవశ్యకత ఎట్టిది?
భాగవత కల్పవృక్షమునకు త్రిమూర్త్యాత్మక శ్రీమన్నారాయణ పరమాత్మ బీజము. త్రిశక్త్యాత్మక మూలప్రవృత్తి శక్తి. మోక్షము ఫలము ఇట్టి భాగవతమును పఠించువారికి, ''మాధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపగాజాలు భక్తి విశేషంబు జనించు'' నని చెప్పబడినది. అనగా పునర్జన్మను తప్పించగల విశేషభక్తి భాగవత పఠనమువలన లభించును. పునర్జన్మ భాగవతమునకు లేదు. పోతనకు లేదు. భక్తి తో పఠించువారికిని లేదు. ''సంగీత జ్ఞానము భక్తి వినాసన్మార్గము కలదే'' అని త్యాగరాజు పాడెను. భగవంతుని అనుగ్రహము మన అందరివైపు ప్రసరించుచున్నప్పటికి భక్తి చేత మనము దానిని గ్రహించుశక్తిని పొందవలెను.
సాధారణముగా మోక్షమును పొందుటకు సాధింపవలసినవి మూడు కలవు.
1) నిష్కామకర్మ నవలింబిచుటచే సిద్ధించిన వైరాగ్యము.
2) #9; మనో విక్షేపమును మాన్పగలిగిన ఉపాసనాదుల నవలంబించుటతే లభించిన ఏకాగ్రత.
3) బ్రహ్మసూత్రములు మహావాక్యములలో తెలుపబడిన ఆత్మానాత్మ విచారముచే కలిగిన ఆత్మానుభూతి ఈఅంశములువరుసగా లభించవలెనను. కాని కేవలం భక్తికిమాత్రమే భాగవతము ప్రాధాన్యత నిచ్చినది. భక్తియోగముచే మోక్షము ప్రాప్తించునని తెపులుచున్నది. భక్తిలేనికర్మ సంసారమున బడవైచును.
శ్లో|| యదత్ర క్రియతే కర్మ భగవ త్పరితోషణమ్
జ్ఞానం యత్త దధీనం హి భక్తియోగ సమన్వితమ్
భాగవతము 1-5-35
ఈ లోకములో భగవత్ ప్రీతికై ఎవడు శాస్త్ర విహితకర్మను చేయునో అతనికి పరాభక్తి యుక్తమైన జ్ఞానప్రాప్తి కలుగును.
భక్తిలేని కేవల నిష్కామకర్మ వ్యర్థము.
శ్లో|| నైష్కర్మ్య మప్యచ్యుత భావ వర్జితమ్
నశోభ##తే జ్ఞాన మలం నిరంజనమ్
కుతః పునః శశ్వతభద్ర మీశ్వరే
నచార్పితం కర్మయద ప్యకారణమ్
భాగవతము 1-5-12
మోక్షసాధకమైన నిర్మలజ్ఞానము కూడ భగవద్భక్తి లేక శోభింపదు. సాధనదశయందు, సిద్దిదశయందు, అమంగళరూపమైన కామ్య కర్మ నిష్కామకర్మ మైనప్పటికి భగవదర్పితముకాక శోభింపదు.
వేద విభజనచేసి బ్రహ్మసూత్రములు, 17 పురాణములు వ్రాసిన తరువాత వ్యాసునకు వైరాగ్యము ఏకాగ్రత బ్రహ్మనిష్ఠ కలుగలేదు. అతడు వ్యాకులచిత్తుడై తన పరిస్థితిని నారదునితో చెప్పుకొనెను. నారదుడు తన జీవితకథను వివరించి చెప్పి భాగవతుల సాంగత్యము చేత తనకనుభవపూర్వముగా మోక్షమార్గము లంభించెనని తెలిపెను.
''ఇట్లు హరిసేవా నిరతింజేసి ప్రపంచాతీతుండనై బ్రహ్మరూప కుండనైన నాయందు స్థూలసూక్ష్మంబైన శరీరంబు నిజమాయా కల్పితంబని అమ్మహాత్ములగు యోగింజనుల మూలంబున రజస్తమో పరిహారిణియగు భక్తి సంభవించె.''
భాగవతము 1-108
ఇంకను,
''నిర్గతకర్మంబై నిరుపాధికంబైన జ్ఞానంబు హరిభక్తి లేకున్న శోభితంబు గాదు.'' అనగా కర్మ ఉపాధింలేని జ్ఞానమార్గము నవలంబించుట కష్టసాధ్యము హరిభక్తి లేనియెడల జ్ఞానముకూడ ప్రకాశింపదు.
''భక్తి హీనములైన జ్ఞాన వాచా క్రమ కౌశలంబులు నిరర్థకములు.''
భక్తిలేని యెడల జ్ఞానకర్మలుకూడ ఫలించవు.
''భక్తిలేక భవదీయ జ్ఞానంబులేద''ని ప్రహ్లాదుడు తెలిపెను. భక్తిపుష్పము వికసించి జ్ఞానఫలము నొసగును. నారాయణ అవతారమైన కపిలుడు'' జ్ఞానయోగంబున మదీయభక్తి యోగంబును రెండును ఒక్కటియ '' అనియు ''భక్తియోగంబుననేని యోగంబుననేని పురుషుండు పరమాత్మం బొందు" ననియు వచించెను. భాగవత భక్తి యోగమునకు జ్ఞానయోగమునకు భేదములేదు. అట్లే సూతుడు తెలిపిన వాక్యములను గమనింపుడు.
''వాసుదేవుయనియందు ప్రయోగంచబడినది భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబుల బుట్టించు (భక్త్యాజ్ఞానం ప్రజాయతే). జ్ఞానవైరాగ్యము లచే గూడిన భక్తిచో తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన ఆత్మయందు పరమాత్మను పొడగందురు'' అనగా జ్ఞాన వైరాగ్యములుకూడ భక్తి చేతనే సిద్ధించునని సూతుని అభిప్రాయము.
భక్తునకు తానే ఆత్మజ్ఞానము కలుగుజేయుదనని శ్రీకృష్ణుడు తెలిపెను.
శ్లో|| తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం
దదామి బుద్ధియోగం తమ్ యేన మా మనుయాంతితే |.
భగవద్గీత 10-10
కోరికలులేక భక్తిచే నెల్లప్పుడు నా సేవలజేయు వారలకు నేనే ఆత్మజ్ఞానము కలుగజేసి నా వద్దకు జేర్చికొందును.
é శ్లో|| ''మచ్చిత్తా మద్గత ప్రాణాః'' నా యందే చిత్త ముగలిగిన వారై నన్ను పొందిన ప్రాణము గలవారికి
శ్లో|| తేషామే వానుక పార్థ మహ మజ్ఞానజం తమః
నాశయ మాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||
భగవద్గీత 10-11
అట్టి భక్తుల యందలి పరమ కారుణ్యముతో ఆత్మ స్వరూపమన నున్న నేను వారి ఆజ్ఞానజనితమగు తమస్సును ప్రకాశమానమగు జ్ఞానదీపముచేత నశింప జేయుచున్నాను.
అన్ని యోగములకన్న మిన్న భక్తి యోగము. యమ నియ మాది అష్టాంగయోగములు ముక్తికి సాధనములని పతంజలి యోగసూత్రములయందు తెలుపబడినది. కాని భాగవతమున నారదుడు తన జీవితరహస్యమును దెలిపి అనుభవపూర్వకముగా అష్టాంగయోగములకంటె శ్రేష్ఠమని తెలిపెను.
చ|| యమ నియమాది యోగముల నాత్మ నియంత్రితమయ్యు
కామరో
షముల ప్రచోదితంబయగు, శాంతి వహింపదు విష్ణుసేవచే
గ్రమమున శాంతి గైకొనిన కైవడి-
భాగవతము 1-32
పై పద్యములో శాంతి అనగా కామాద్యరి షడ్వర్గముల లయమని అర్థము. యమ నియమాదులతో కూడిన హఠయోగము అష్టసిద్దులను గూర్చును. మనోలయస్థితిని కలిగించును. ఈ స్థితినుండి బయటకువచ్చిన తరువాత మనస్సు మరల ప్రకోపించి కామాద్యరిషడ్వర్గము వెంటబడును. అట్లుగాక అరిషడ్వర్గము తొలిగి నిరంతర మనశ్శాంతి చేకూరవలయు నన్నచో హరిసేవ ప్రధానమని నారదుడు తన అనుభవమును తార్కాణముగా జూపెను. అనుభవముతో జెప్పిన వాక్యమునకు విలువ ఎక్కువ. ఈ అభిప్రాయము ఉపదేశసారమున గ్రంధమున రమణమహర్షి క్రింది విధముగా వివరించెను.
''వాయురోధనా ల్లీయతే మనః
జాలపక్షవత్ రోధ సాధనమ్''
వలలోబడిన పక్షి కదలక యండురీతిని, వాయురోధనము (అనగా ప్రాణాయామముచేత లేదా ప్రాణ గత్యాగతి ప్రత్యవేక్షణము చేత) కట్టబడిన మనస్సు చలింపక యుండును.
''లయ వినాశ##నే ఉభయ రోధనే
లయ గతం పునర్భవతి నోమృతమ్''
మనోవృత్తి మాత్రోప సంహారము ''లయ'' మనబడును. లయమును బొందిన మనస్సు మరల పుట్టును. దీనిలో మూలవృత్తి యగుఅహంకారము శేషించి యుండును. ఒక వృక్షమును బోధివరకు చేదించుటను మనోలయముతో పోల్చవచ్చును. అది మరల చిగుర్చును కదా? అనగా పంజరమున బంధింపబడిన చిలుక వెలుపలకి వచ్చి యధేచ్చగా విహరించును. అహంకార ముండువరకు అభ్యాసకాలమున సమాధియు ఇతర కాలములలో మనోవ్యాపారము కలుగును. కాబట్టి నారదు డనుభవ జ్ఞానమున తెలిపినట్లు యమ నియమాది యోగములమనోలయము సిద్ధించినను, సమాధినుండి బయటికి వచ్చినప్పుడును మరల కామాద్యరిషడ్వర్గముల మనస్సున ప్రకోపముచెందుటచే శాంతి చేకూరదు. మూలవృత్తి యగు అహంకారముకూడ నశించిన, మనస్సు వినాశము చెంది, మరల పుట్టదు. ఒక చెట్టు వేర్లతోకూడ పెకలింపబడుటను మనోవినాశముతో పోల్చవచ్చును. మరల అది మొలకెత్తుప్రసక్తియే లేదు. విష్ణుసేవచే ఇట్టి మనోవినాశస్థితి లభ్యమగునని నారదుని అనుభవము. ఆత్మానుభూతిచే వినాశముచెందిన మనస్సు తిరిగి ఉద్భవించదు. భక్తియోగము మనోవినాశమునకు దారి జూపి, అరిషడ్వర్గమును పారద్రోలి మోక్షమార్గము జూపునని భాగవత సందేశము.
అష్టాంగమయోగముల వలెనే ఉపవాసాది కర్మలు కూడ భక్తి లేక నిరర్థకముల, వానిచే మోక్షము లభించదని భాగవతము చాటి చెప్పుచున్నది.
ము|| ఉపవాసవ్రత శౌచ శీలమఖ సంధ్యోపాస నాగ్నిక్రియా
జప దానా ధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర: ద
చ్చవుభక్తిన్ హరి, పుండరీకనయనున్, సర్వాతిశాయిన్, రమా
ధవు, పాపఘ్ను, బరేశు నచ్యుతుని నర్థిన్ గొల్వ లేకుండినన్
భాగవతము 2-214
శ్రీమన్నారాయణుడు కూడ భక్తి లేని కర్మల నాదరింపడు.
ము|| క్రతు దానోగ్రతపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల
వ్రత చర్యాదుల నాదరింప వఖిల వ్యాపార పారాయణ
స్థితి నొప్పారెడి నీ పదబ్జ యుగళీ సేవాభిపూజా సమ
ర్పిత ధర్ముండగు వాని భంగి నసురారీ దేవ చూడామణీ
భాగవతము 3-301
వనతటాకోప నయన వివాహదేవ
భవననిర్మాణ భూమ్యాది వివిధదాన
జపతపోవ్రత యోగయజ్ఞములు ఫలము
మామకస్తవ ఫలము సమంబుగాదు.
భాగవతము 3-328
యోగజనిత జ్ఞానమున్నను భక్తి లేక శ్రీహరిని దర్శింపజాలవు. బ్రహ్మదేవుడు 100 సంవత్సరములు తపస్సుచేసి యోగజనిత జ్ఞానముండియు కమలనయనుడైన శ్రీహరిని కనుగొనలేకపోయెను. కాని ''కనియెన్ నిశ్చల భక్తి యోగము'' అని భాగవతము తెలుపుచున్నది.
త్రికరణ శుద్ధిగా ధ్యానించువారు. ఆత్మధ్యాన మొనర్చువారు- వీరిలో ఎవ్వరధికులని - సగుణ నిర్గుణ భక్తులలో ఎవరు శ్రేష్ఠులని అర్జునుడు 12వ అధ్యాయమున ప్రశ్నించెను. దానికి బదులుగా శ్రీకృష్ణుడు
శ్లో|| #9; మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తేమే యుక్తతమా మతాః
భగవద్గీత 12-2
నాయందు మనస్సు నిలిపి నిత్యయుక్తుడై అదిక శ్రద్ధతో నన్ను ఉపాసించువారు శ్రేష్ఠులని తెలిపెను.
ఇంకను శాస్త్రజ్ఞానమును భక్తునకే ఉపదేశింపవలెనని గీత తెలుపుచున్నది. గీతాశాస్త్రము నెవరి కుపదేశింపవలెను. ?
శ్లో|| య ఇమం పరమం గుహ్యం మద్భక్తే ష్యభిధాస్యతి
భక్తిం మయిపరాం కృత్వా మామేవైష్యత్య సంశయః
భగవద్గీత 18-68
అతి రహస్యమైన గీతాశాస్త్రమును నాభక్తుల కెవ్వడుచెప్పునో అతడు నాయందు శ్రేష్ఠమైన భక్తి గలవాడై నన్నే పొందలగడు.
అందులకే శంకరాచార్యులు పై శ్లోక వ్యాఖ్యానమున ''భ##క్తేః పునః గ్రహణాత్ భక్తి మాత్రేణ కేవలేన శాస్త్ర సంప్రదానే పాత్రంభవతి'' అన్నారు. శాస్త్ర-విజ్ఞానమును బోధించుటకు కేవల భక్తియే పాత్రతను గూర్చుచున్నది. ధర్మాధర్మ నిర్ణయము చేసికొని మంత్ర యోగాదులచే సాధించి వివేకము తర్కముతో పురోగతిని పొందుట జ్ఞానము ఇందులో పొరపాటు సంభవించిన పతనము కలుగును.
ఆత్మార్పణబుద్ధితో ఈశ్వరునిపై భారముంచి భక్తితో వర్తించు వాడు ప్రసన్నుడు. ఇచట పొరపాటు సంభవించినను భగవంతుడు సరిచేయును.
భక్తియోగము సులభమా జ్ఞానయోగము సులభమా?
శ్రో|| నహి జ్ఞానేన సదృశం పవిత్రం మిహ విద్యతే
తత్స్వం యం యోగసంసిద్ధః కాలేసా೭೭ త్మని విన్దతి.
భగవద్గీత 4-38
జ్ఞానము పవిత్రమైనది.దానితో సమాన మింకొకటిలేదు. అట్టి జ్ఞానమును బహుకాలశ్రద్ధతో పొందగలడు. జ్ఞానముతో సమానమైనది లేదని శ్రీకృష్ణుడు గీతలో చెప్పినప్పటికి మనస్సును తదాకారము చేయుట లేక బ్రహ్మాకార చిత్తవృత్తిగా చేయుట కష్టము. బ్రహ్మాత్మైకజ్ఞానము సత్యమైనప్పటికిని అది నిర్గుణము, నిరుపాధికము, అవ్యక్తము, అనిర్వాచ్యము, అచింత్యము అగుటచేత సులభసాధ్యముకాదు. భాషవలన రూపనామములను, గుణము, వస్తువు, క్రియ వీనిని తెలుప వచ్చును. ఇంద్రియములకు మనస్సునకు అందని నిర్గుణ వస్తువును గూర్చి వర్ణింపజాలము. సచ్చిదానంద పరబ్రహ్మోపాసనముకంటె, ప్రేమమూలకమగు భక్తి యోగము సులభము. ఆత్మను గురుంచిశ్రీ కృష్ణుడు గీతలో రెంéడవ అధ్యయమున అనేక విధములుగా అవినాశియని, అచ్ఛేద్యమని, అచింత్యమని తెలిపెను.కాని అర్జునునకు దానిని అనుభవ పూర్వకముగా తెలిసికొనుట సాధ్యముకాలేదు. (నాయమాత్మా సప్రవచనేన లభ్యో) అందులకే శ్రీకృష్ణుడు తెలిపెను.
శ్లో|| ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేన
మాశ్చర్యవ ద్వదతి తథై వ చాన్యః
ఆశ్చర్యవచ్చైన మనః శృణోతి
శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్
గీత 2-29
ఒక డీ యాత్మను ఆశ్చర్యవస్తువువలె జూచును. మరియొక డీ యాత్మను ఆశ్చర్యమువలెనే చెప్పును. మరియొక డాశ్చర్యముగా వినును. ఇంకొకడు వినియు చూచియుచెప్పియు తెలిసికొనడు.
ఆత్మజ్ఞానము సులభముగా లభ్యముకాదని వేదమున బాష్కలుని కథమూలమున చెప్పబడినది. బాహ్వుడనువానిని బ్రహ్మజ్ఞాన ముదేశింపు భాష్కలుడు కోరెను. అతడేమియు చెప్పక మిన్నకుండెను. మరల భాష్కలుడు ప్రశ్నించెను. అప్పుడును బాహ్వుడూరకుండెను. నాలుగైదు పర్యాయము లిట్లు జరుగగా ''నేను చెప్పచునే యున్నాను. బ్రహ్మస్వరూపము చెప్పుటకు వీలుపడనిది'' అని బాహ్వుడు బదులు చెప్పెను.
అనగా నోరు మూసికొని చెప్పుటకు సాధ్యమగునదియు (మౌనవ్యాఖ్యానము). కన్నులు మూసికొనిన పిదప కనబడునదియు, తెలియుట మానినపిదపి తెలియునదియు - ఆత్మ అని ఫలితాంశము. ఆత్మఉన్నదని కొందరు,లేదని కొందరు ఉండియు లేదని కొందరు, లేనేలేదని కొందరు వాదించిరి. కాని పరమార్థము ఈ నాలాగు భావములకు అతీతము. బుద్ధి గమ్యమైన ఆత్మాజ్ఞానము పొందుట క్లేశతరము.
అవ్యక్తోపాసనచే జ్ఞాననిష్ఠ సిద్ధించును. వ్యక్తోపాసన, ప్రతీకోపాసన, విభూతి యోగములచే ప్రేమపూర్ణమైన భక్తి సిద్ధించును. బుద్ధిగమ్యమైన మార్గమొక్కటియే ఆత్మను పొందుటకున్న ఏకైక సాధనమైన యెడల అజ్ఞానులైన పామరుల కది పొంద సాధ్యము కాదు. అట్టివారికొరకై చెప్పిన రెండవమార్గమే భక్తి మార్గము. భక్తి లేనియెడల నిష్కామకర్మగాని జ్ఞానముకాని శోభింపవు.
é శ్లో|| నైష్కర్మ్యమప్యచ్యుతభావవర్జితం
నశోభ##తే జ్ఞాన మలం నిరంజనమ్.
భాగవతము 12-12-52
స్త్రీ శూద్రులకు వేదాధికారములేదు. కాని భక్తి అందరికి అందుబాటులో నున్నది.
శ్లో|| మాం హి పార్థ! వ్యాపాశ్రిత్య యేపిన్యుః పాపయో నయః
స్త్రియో వైశ్యా స్తధా శూద్రాస్తే7పి యాంతి పరాం గతిమ్
గీత 9-32
''నన్నాశ్రయించిన పాపజన్ములు శూద్రులు, స్త్రీలు, వైశ్యులు, అందురు ఉత్తమగతిని పొందుచున్నారు'' అని శ్రీకృష్ణుడు తెలుపుట చేత ఇది భగవంతుని విశేష అనుగ్రహముగా భావింపవలెను. ఇంకను é
''నమే భక్తః ప్రణశ్యతి'' -గీత 9-31
తన భక్తుడెన్నటికిని నాశము బొందడనికూడ చెప్పెను. ఇది ఎంతటి భక్త వాత్సల్యమో గమనింపుడు. భగవంతుడు భక్తసులభుడు కాబట్టి భక్తి మార్గమే శ్రేష్ఠమని భాగవతము సూచించుచున్నది. ''సుఖం కర్తు మవ్యయం'' -గీత 9-2
భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడగు యోగినిగూర్చి ఇట్లు తెలిపెను. కర్మ, ధ్యాన, జ్ఞాన యోగులలో ఎవరుగాని తనయందు మనస్సు నిలిపి అనగా భక్తి కలిగియుడంవలెను.
శ్లో|| యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా
శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమో మతః
గీత6-47
శ్రద్ధావంతుడై నాయందు మనస్సునిలిపి నన్ను భజించువాడు యోగులందరిలో ఉత్తమ యోగి. భాగవతముకూడ జ్ఞానమును శ్రద్ధా భక్తులచే పొందవచ్చునని పై అభిప్రాయమునే సూచించినది. భక్తిని పొందగలిగిననే భగవంతుని తెలుసుకొనగలడు అతని యందు లీనము చెందగలడు.
శ్లో|| భక్త్యా మా మభిజానాతి యదా స్యశ్చాస్మి తత్త్వతః
తతోమాం తత్త్వతో జ్ఞాత్వావిశ##తే తదనంతరమ్.
గీత 18-55
భక్తిని బొంది, నే నెవడనో ఎట్టివాడనో తెలిసికొనగలిగి అట్టి యదార్థ అనుభవ జ్ఞానముచే నాయందు లీన మగును. యోగు లందరి లోను భక్తుడే ఉత్తమయోగి. భక్తియే ధ్యాన జ్ఞానయోగములకు సాధనము. భక్తి యోగముచే పొందుస్థితియు, జ్ఞానయోగముచే పొందుస్థితియు ఒక్కటియే. భక్తుని లక్షణములు స్థితప్రజ్ఞుని లక్షణములు ఒకటిగా చెప్పబడినవి చూడుడు;
స్థిత ప్రజ్ఞుని లక్షణములు :-
(గీత 2వ అధ్యాయమున 55వ శ్లోకము నుండి)
1) కోర్కెలను విడచినవాడు (ప్రజహాతి కామాన్)
2) ఆత్మయందు సంతుష్టి బొందువాడు (ఆత్మన్యేవాత్మనా తుష్టః)
3) దుఃఖములందు క్షోభ నొందకుండవాడు (దుఃఖేష్వను ద్విగ్న మనాః)
4) సుఖములయం దాసక్తి లేకుండువాడు (సుఖేషు విగత స్పృహః)
5) రాగ, భయ, క్రోధములు లేనివాడు (వీత రాగ భయ క్రోధః)
6) సమస్త విషయములయందును అభిమానము లేనివాడు (యస్సర్వ త్రాభిస్నేహః)
7) ప్రియా ప్రియములు సంభవించినను. సంతోషముగాని ద్వేషముగాని లేనివాడు (తత్తత్ప్రాప్యశుభాశుభమ్ నాభినందతి నద్వేష్టి)
8) విషయము నింద్రియముల నుండి మరల్పువాడు (యదా సంహరతే చా యం కూర్మోంగాని వ సర్వశః ఇంద్రియా ణీంద్రియార్ధేభ్య స్తస్యప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
గీతా 2-58)
భక్తుని లక్షణమలు:-
(గీత 12వ అధ్యయమున 13వ శ్లోకమునుండి)
1) ఏ ప్రాణిని ద్వేషింపకుండుట. 2) మైత్రి. 3) కరుణ 4) మమత్వము లేకుండుట. 5) అహంకారము లేకుండుట. 6) సుఖదుఃఖములందు సమత్వము 7) ఓర్పు 8) నిత్య సంతుష్టి, 9) మనో నిగ్రహము. 10) దృఢ నిశ్యయము. 11) మనోబుద్ధులను భగ వంతునకు సమర్పించుట. 12) లోకమువలన తాను గాని తన వలన లోకముగాని భయపడకుండుట. 12) హర్షము క్రోధము భయము లేకుండుట. 14) దేనియందును అపేక్షలేకుండుట. 15) శుచిత్వము కలిగియుండుట. 16) కార్యసామర్థ్యము. 17) తటస్థత్వము. 18) మనోవ్యాకులత లేకుండుట. 19) సర్వ కర్మఫల త్యాగము. 20)హర్షము లేకుండుట. 21) ద్వేషములేకుంéడుట. 22) శోకములేకుండుట. 23)కోరిక లేకుండట. 24) శుభాశుభ పరిత్యాగము. 25) శత్రుమిత్రులందు సమత్వము 26) మానావ మానములయందు సమభావము 27) శీతోష్టములందు సమత్వము. 28) సుఖదుఃఖములయందు సమ భావము 29) సంగవర్జిత్వము 30) నిందాస్తుతులందు సమత్వము. 31)మౌనము 32) దొరకిన దానితో సంతుష్టి. 33) నివాసమునందభిమానము లేకుండుట. 34) స్థిరబుద్ధి. 35) భగవంతుని యందు భక్తి.
స్థితప్రజ్ఞునికి చెప్పిన లక్షణములను పరిశీలించిన భక్తుని లక్షణములు నవియేయని గమనించవచ్చును.
భాగవత భక్తిస్వరూపము:
భగవద్గీత ననుసరించి మానవుడు సాంఖ్యజ్ఞానమున నిత్యా నిత్యవస్తువివేకమునుపొంది, నిష్కామకర్మవలన చిత్తశుద్ధిని గాంచి ధ్యానము నవలంబించి పరమభక్తిని పొందవచ్చును. కాని భాగవతము భక్తికి ఒక విశిష్టయోగస్థానము కల్పించినది. భాగవతభక్తి రహస్యమును తెలుసుకొనుటకు భగవద్గీతలోని గుణత్రయ విభాగయోగము పూర్తిగా గ్రహింపవలసి యున్నది. ముందు దానిని విచారింతము.
శ్లో|| మాంచ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే
సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే||
భగవద్గీత 14-26
ఎవడు భక్తియోగముతో నన్ను సేవించునో వాడీ త్రియగుణము లను అతిక్రమించి ముక్తిని బొందగలడు.
త్రిగుణము లనగానేమి? వాని నతిక్రమించి ముక్తిని బడయుటెట్లు?
భగవంతుడు గుణాతీతుడైనప్పటికిని, తన మాయ లేదా ప్రకృతి చేత సత్వరజస్తమో గుణాత్మకమును నామరూపాత్మకమును అగు జగత్తును సృష్టించెను. సృష్టి ఏర్పడుట కనేక వాదములు చెప్పబడినవి.
1) ఆరంభ వాదము:- కణాదుడు పరమాణువుల కలయిక వలననే జగత్తుఏర్పడెనని తెలిపెను. దీనిని ఆరంభవాద మందురు. ఇది నైయాయకుల వాదము
''పరమాణవః జగద్భావాయ సంబద్ధాత్''
సూక్తార్థ రహస్యము
2) గుణపరిణామవాదము :- ప్రకృతియొక్క సత్వరజస్తమో గుణవికాసము చేత సృష్టి ఏర్పడెనని సాంఖ్యులు తెలిపిరి.
3) వివర్తవాదము:- బ్రహ్మము నిర్గుణము, ఇంద్రియముల ధర్మముల మూలమున సగుణ దృశ్యము లుత్పన్నమగు చున్నవని అద్వైతము వేదాంతులు తెలిపిరి.
4) అజాత వాదము:- సృష్టి పారమార్థిక దృష్ట్యా అసత్యమని ఈ వాదము తెలుపును.
'' అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతీ గ్‌ంసరూపాం అజోహ్యేకో జుషమాణో೭ ను శేతే జహాత్యేదాం భుక్త భోగా మజోన్యః''
ఎరుపు రజోగుణము, తెలుపు సత్వగుణము, నలుపు తమోగుణము, ఈ గుణత్రయముగల ప్రకృతి అనేక శరీరాలకు కారణము.
శ్లో|| మమ యోని ర్మహద్ర్బహ్మా తస్మిన్ గర్భం దధామ్యహం
సంభవ స్సర్వభూతానాం తతో భవతి భారతః
గీత 14-3
భూతముల సృష్టిస్థానము నా యొక్క గొప్ప ప్రకృతి. ఆప్రకృతి యందు నేను గర్భకారణమగు బీజము నుంచుచున్నాను. అందుచే సమస్తభూతముల యొక్క ఉత్పత్తి అగుచున్నది.
శ్లో|| సర్వయోనిషు కౌన్తేయ మూర్తయ స్సంభవంతి యాః
తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః పితా.
గీత 14-4
సమస్త యోనులందు ఏఏ మూర్తులు బుట్టచున్నవో వాటి కన్నిటికిని ప్రకృతి తల్లి వంటిది. నేను బీజప్రదుడను గాన తండ్రిని.
శ్లో|| మయా ధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్
గీత 9-10
నా అధ్యక్షతచేతనే చరాచరమగు సమస్త భూతములను ప్రకృతి పుట్టించుచున్నది.
భగవద్గీతలోభూత సృష్టి పై విధముగా తెలుపబడినది.
భగవంతు డెందులకు సృష్టించెనని అడుగవచ్చును. భాగవత మిందులకు చక్కని సమాధానము చెప్పినది. భగవంతుని సృష్టికార్యమతని లీల. ఇట్టి లీలవలన భగవంతుడు మానవునకు దుఃఖకరమైన సంసారము నేల కలిగించెనని విదురుడు మైత్రేయుని ప్రశ్నించెను. సంసార దుఃఖము మాయా జీవితమనియు అసత్యమనియు, ఆవిద్యవలన ఏర్పడినదని విదురుడు తెలిపెను. స్వప్నములో తల నఱకుట ఎంత అసత్యమో సంసారమంత అసత్యమని తెలిపెను. కావున భాగవతము ''జగన్మిథ్య'' అను అద్వైతభావమును సమర్థించుచున్నదని అనవచ్చును.
సీ|| ఆద్యంత శూన్యంబు సవ్యయంబై తగు
తత్త్వమింతకు నుపాదానమగుట
గుణవిషణయములు గైకొని కాలమును మహ
దాది భూతములు దన్నాశ్రయింప
గాలానురూపంబు గైకొని ఈశుండు
దనలీలకై తనుదా సృజించె
గరమొప్పనఖిల లోకములందు దానండు
దనలోన నఖిలంబు దనరుచుండు
గాన విశ్వమునకు గార్య కారణములు
దాన, యమ్మహాపురుషుని తనవువలన
బాసి విశ్వంబు వెలియై ప్రభాసమందె
మానితాచార ఈ వర్త మాన సృష్టి
భాగవతము 3-342
మాయచేత సృష్టిజరిగెను. ''మా'' అనగా ఆకారమును గ్రహించుట.
శ్లో || ఋతే ర్థం యత్ ప్రతీయేత నప్రతీయేతచాత్మని
తద్విద్యా దాత్మనో మాయాం యధా೭೭ భాసోయధా తమ!
2-9-33
మాయవలన తాను ప్రకృతి పురుషుడుగా మారి గుణముల సహాయమున తన నుండియే సాలె గూడు నిర్మాణమువలె సృష్షి జరిపెను.
శ్లో|| పదార్ధేషు యదా ద్రవ్యం సన్మాత్రం రూపనామసు
బీజాది పంచతాం తాసు హ్యవస్ధాసు యుతాయుతమ్.
12-7-20
ఘటాదులయందు మట్టి రూపనామములతో కూడక సత్తామాత్రముండు నటుల దేహముయొక్క 9 అవస్థలయందును అదిష్ఠానము సాక్షిభూతమునై ఆత్మయుండును. దీనిని అపాశ్రయ మందురు.
శ్లో || సృష్ట్వా పునర్గ్రవసి సర్వమివోర్ణ నాభిః
సాలెపురుగు తన గర్భమునుండి దారమును సృజించి ఆ గూడును తన నోటితో మ్రింగివేయునట్లు భగవంతుడు ఇతర సాయ మపేక్షింపకయే సృజించి నశింపజేయును. 12-8-41
సృష్టిస్థితిలయములు అతని లీల ''దనలీలకై తనుదా సృజించె'' భాగవతము 3-342- ''విశ్వమునకు గార్యకారణములు దాన''
పై వివరణ అసలు సృష్టి జరుగలేదను అజాతవాదమునే సమర్థించుచున్నది.
సృష్టిస్థితిలయములను పొందు ప్రపంచము త్రిగుణాత్మకమై యున్నది. త్రిమూర్తులు త్రిశక్తులు త్రిగుణాత్మకులు, మానవుడు కూడ త్రిగుణాత్ముడే ఈ త్రిగుణములు త్యజించిన మోక్షము లభించునని భాగవతముకూడ భగవద్గీతవలెనే తెలుపుచున్నది.
''సత్వరజస్తమో గుణ విహీనుండైన జనుండు మత్సమానాకా రంబు నొందు'' అని నారాయణావతారుడైన కపిలుడు తల్లియగు దేవహూతికి తెలిపెను.
అట్లే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ''నిసై#్త గుణ్యో భవార్జున'' త్రి గుణములను త్యజింపుమని బోధించెను.
త్రిగుణములెట్లు జీవుని బద్ధునిజేయును:
భగవద్గీతలో సత్వరజస్తమో గుణములు జీవునెట్లు బద్ధుని జేయుచున్నవో కూడ చెప్పబడియున్నది. త్రిగుణములకు లోబడినవాడు మూడు లోకములలోను లేడు.
శ్లో || నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషువా పునః
సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యధేబిస్స్వా త్రిభిర్గుణౖః
గీత 18-40
ప్రకృతిచే జనించిన ఈ సత్వాది గుణములకు లోబడని ప్రాణి మానుషలోకముందుగాని, దేవలోకమందుగాని, పాతాళలోకమందుగాని లేదు.
ప్రపంచము మాయ అని మనమందుము. కాని నీవు ప్రపంచమునకు వేరుకాదు కదా! నీవచనములు మాయయే. నిన్ను నీవు తెలిసికొన్నగాని త్రిగుణాత్మకమగు మాయను ప్రపంచమును తెలిసి కొనజాలవు. త్రగుణములు తొలిగిన మాయ తొలగి సర్వము ఆత్మ స్వరూపముగా భాసించును.
శ్లో || సత్వం రజస్తమ ఇతి గుణాఃప్రకృతి సంభవాః
నిబద్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయమ్
భగవద్గీత 14-5
ప్రకృతినుండి పుట్టిన సత్వరజస్త మోగుణుములను మూడు గుణములు నాశరహితుడగు జీవుని బంధించుచున్నవి.
శ్లో|| తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనామయం
సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ||
భగవద్గీత 14-6
సత్వగుణము నిర్మలమైనది; ప్రకాశమిచ్చునది; ఉపద్రవము లేనిది, దీనివలన సుఖమునందును, జ్ఞానమునందును ఆశ కలుగును, అందుచే జీవుడు బద్ధుడగును.
శ్లో|| రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవయ్
తన్నిబధ్నాతి కౌంతేయః కర్మసంగేన దేహినమ్.
భగవద్గీత 14-7
రజోగుణము ప్రాపంచిక విషయములందాసక్తి కలిగించును. చూచిన వస్తువులన్నియు దనకు కావలెనను కోరిక తనకు లభించిన దానిని విడువకూడదను అభిమానము , గల్పించి దానిచే జీవుని బందించును.
శ్లో || తమ స్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత!
భగవద్గీత 7-8
తమోగుణము అజ్ఞానముచేత బుట్టినది. అది జీవులను వివేక హీనులగ జేయును. దీనివలన ప్రమాదము, సోమరితనము, నిద్ర కలిగి వాని మూలమున జీవుని బంధించును.
శ్లో || సత్వం సుఖే నంజ్ఞయతి, రజఃకర్మణి భారతః
జ్ఞాన మావృత్యతు తమః ప్రమాదే సఞ్జ యత్యుత.
గీత 14-9
సత్వగుణము సుఖమందును, రజోగుణము కార్యములందును తమోగుణ మజ్ఞానమునందును సంగమము కలుగజేయును.
శ్లో || సత్వాత్ సంజాయతే జ్ఞానం , రజసోలోభ ఏవచ
ప్రమాదమోహ తమసో భవతో೭ జ్ఞాన మేవచ
గీత 14-17
సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణమువలన లోభము, తమోగుణము వలన ప్రమాదము, మోహముచే అజ్ఞానము గలుగును.
శ్లో || గుణానేతా నతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్
జన్మమృత్యుజరా దుఃఖై ర్విముక్తో అమృత మశ్నుతే||
భగవద్గీత 14-20
దేహమునకు కారణభూతమైన సత్వరజప్తమో గుణములనుదేహి ఎప్పు డతిక్రమించునో అప్పుడతడు జన్మమృత్యుజరా దుఃఖములచే విడువబడి మోక్షము పొందును.
అందువలననే రథసప్తమినాడు క్రింది మంత్రమును జపము చేయుదురు.
''కామో కార్షీ న్నమో నమః, కామో కార్షీ త్కామః కరోతి
నాహం కరోమి, కామః కర్తా, నాహం కర్తా, కామః కారయితా, నా
హం కారయితా, ఏషతే కామ కామాయ స్వాహా||
అనగా రజోగుణమువలన కామ ముద్భవించుననియు, ఆకామమే కర్తయనియు, అదియే కార్యములను చేయించుచున్నదనియు, తాను కేవల సాక్షియనియు భావము.
భగవద్గీతలో కూడ
శ్లో|| కామయేషు క్రోధయేషు రజోగుణ సముద్భవః
భగవద్గీత 3-37
కామ, క్రోధములు రజోగుణమువలన ఏర్పడును.
శ్లో|| నాన్యం గుణభ్యః కర్తారమ్ యదా ద్రష్టానుపశ్యతి
గుణభ్యశ్చ పరం వేత్తి మధ్బావం సోభి గచ్ఛతి.
గీత 14-19
ఎవడు గుణములే కర్తలనియు తాను సాక్షియై త్రిగుణములకంటె వేఱుగా నున్నాననియు, తెలిసికొనినవాడు నా స్వరూపమును బొందును.
చెప్పవచ్చిన దేమనగా త్రిగుణములనధిగమించుటకు దెల్పిన మార్గమే భాగవత భక్తి మార్గము.
''నరునకు నాత్మదేహజ గుణంబుల బాపగనోపు పంకజో
దరచరణారవింద మహితస్ఫుట భక్తియ''
భాగవతము 3-242
నారదుడందులకే తనకు రజస్తమోగుణ పరిహారిణియగు భక్తి లేదా శుద్ధ సాత్విక భక్తికలిగెనని తన జీవితరహస్యమును చెప్పెను. ఈ గుణత్రయమును తొలగించుటను గూర్చి శ్రీ నృసింహతాపిని ఉప నిషత్తునందు విద్యారణ్య వ్యాఖ్యానమున చెప్పబడినది.
'' కార్యరూప జగత్తు ప్రకాశ, చలన, ఆవరణరూపమై యున్నది. ప్రకాశము సత్వగుణము, చలనము, రజోగుణము, ఆవరణము తమోగుణము, జగత్తునకు కారణము ఆవిద్యా రూపమాయ, ఈ మాయ సత్వగుణము చేత చైతన్య పరబ్రహ్మము నభివ్యక్తము చేయుచు బ్రహ్మజ్ఞానముకు హేతువగుచున్నది. రజోగుణముచే స్పందశక్తి రూపమై(నకుశల స్పందితుమపి) చలనాత్మకమై నానా విధ భేదము లకు సంకల్పములకు సృష్టికి భేదజ్ఞానముకు గారణమగుచున్నది. తమోగుణముచే నాత్మచైతన్యమునే ఆచ్ఛాదించుచున్నది. ఆత్మజ్ఞానమును కలుగనీయక అజ్ఞానమునకు మూలకారణమగుచున్నది.
మలవిక్షేప ఆవరణ రూప దోషత్రయము తమోగుణ రజోగుణ సత్త్వగుణ స్వభావమై యున్నది.''
శ్రీ నృసింహ ఉత్తరతాపిని- విద్యారణ్య వ్యాఖ్య
మలము నిష్కామ కర్మానుష్ఠానము చేతను, విక్షేపము నిశ్చల ధ్యానముచేతను, ఆవరణము ఆత్మ విచారణచేతను నశించును.
భౌతిక రసాయనాది శాస్త్రుజ్ఞులు నిజస్వరూపమును తెలిసికొన జాలక ప్రపంచస్వరూపమును తెలిసికొన ప్రయత్నింతురు. పాశ్చాత్యులందరు బాహ్యప్రపంచమునే పరిశీలించిరి. మనస్సుపై గాని, ఆత్మపై గాని, పరిశీలన జరుపలేదు. నిజస్వరూపము తెలిసికొన్న నీవు గాక వేరే ప్రపంచముండదు. మనస్తత్వశాస్త్రమును ప్రవర్తనయొక్క శాస్త్రమమని నిర్వచించిరి.(Science of behaviour)
క్రమ గుణ దేహ మల వాసనలు అధికార నివారణో ఫలితము
సంఖ్య త్రయము త్రయము త్రయము త్రయము పాయము
1 తమో స్థూల మలము విషయ మందాధికారి నిష్కామ పైరాగ్యము
గుణము దేహము Grossness వాసనలు కర్మ ఇంద్రియ
Gross body (Sin) (లోక,శాస్త్ర నిగ్రహము
దేహవాసనలు)
2 రజో సూక్ష్మ విక్షేపము విషయ వాస మధ్యదికారి ఏకాగ్రత మనోల
గుణము దేహము Fickleness నలపై రాగము యము
Astralbody (Vaccillation)
3 సత్వగు కారణ ఆవరణము వాసనానివృత్తి ఉత్తమాధికారి చింతనము సహజ
ణము దేహము Covering స్థితి
(casual body) (encrustation) ధ్యానజీవన్ము
క్తి
మనోవినాశము
సత్వరజన్తమోగుణములనబడు గుణత్రయము నధిగమించుట గాని, మల విక్షేప ఆవరణముల తొలగించుటగాని, విషయవాసనలపై అనురాగము తొలగించి మనస్సును నిర్విషయము చేయుటగాని పై కార్యములన్నియు ఒకే మార్గమును సూచించుచున్నవి. ''నాన్యః పంథా విద్యతే యనాయ'' అన్ని మార్గములు ఇంద్రియ మనంబుల నిగ్రహించుటకే అటు తరువాత నే స్వస్వరూపానుసంధానము బ్రహ్మనిష్ఠ కుదురును. భాగవతమున త్రిగుణాదుల నివారణమునకు సులభో పాయము సూచించుటయే భాగవత భక్తి మార్గరహస్యము. అది రజ స్తమోగుణ పరిహారిణియగు భక్తిమార్గము - ఈ మార్గమును పరిశీలింతము.
తమోగుణము:
తమోగుణమువలన ఇంద్రియములు స్థూలదేహము కలిగినవి. పంచేద్రియములు ఇంద్రియార్థముల వైపునకు మరలి కామమును కలిగించును. దానివలన ఇతర ఆరిషడ్వర్గములగు క్రోశ, లోభ, మద, మాత్స్యర్యము లేర్పడును. కఠోపనిషత్తున శరీరము రథముగను ఇంద్రియములు గుఱ్ఱములుగను బుద్ధి సారధిగను చెప్పబడినది. మనస్సు అను కళ్ళెమువైచి, ఇంద్రియమును గుఱ్ఱములను బాగుగా లాగిన యొడల వానిని విషయమార్గమున నియమబద్ధముగా నడుపవచ్చును. ఇంద్రియములను నిగ్రహించినంతమాత్రమున కామము నరికట్టవీలు కాదు. భగవద్గీతలో ఈ విషయముగమనించుటకై శ్రీకృష్ణుడిట్లు తెలిపెను.
శ్లో || విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః
రసవర్జ్యం రసో೭ ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే||
గీత 2-59
ఆహారము మాత్రము విడచిన దేహి విషయములు మాత్రమే విడచునుగాని వానియందలి అభిలాష మనస్సును నుండును. '' బలవానింద్రియ గ్రామో విద్వాంస మసి కర్షతి'' అనుటచేత విషయములపై అనురాగమువదలదు. ఆత్మానుభూతి కలిగిన తర్వాతనే అది నివర్తించును. అందువలన విషయవాసనలు కామము వదలుటకు వైరాగ్యము సిద్ధించుటకు నిష్కామకర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెయునని భగవద్గీత తెలుపుచున్నది.
శ్లో|| ఏతాన్యపితు కర్మాణి సంగం త్వక్త్వా ఫలాదిచ
కర్తవ్యానీతి మే పార్థ! నిశ్చితం మత ముత్తమమ్
గీత 18-6
ఈ యజ్ఞదాన తపఃకర్మలను కూడ మమత్వమును ఫలకాంక్షను విడచి తనకు విధియని తలచి చేయుట యుక్తమని నా నిశ్చయముగు నుత్తమాభిప్రాయము.
శ్లో || యత్కరోషి యదశ్నాసి యజ్ఞుహోషి దదాసియత్
యత్తసస్యసి కౌన్తేయః తత్కురుష్వ మదర్పణమ్||
గీత 9-27
దేహయాత్రకు వలయునట్టి లౌకిక కర్మ ఏది చేయుచున్నావో దేహధారణము కొఱకు ఏది హోమము చేయుచున్నావో ఏది దానము చేయుచున్నావో దానిని నా కర్పణము చేయుము.
అట్లే భాగవతమున కూడ
''కర్మంబులు సంసారహేతుకంబు లయ్యును ఈశ్వరార్పితంబులై తామ తమ్ము చెరచుకొన నోపి యుండును. ఈశ్వరునియుందు చేయబడు కర్మంబు విజ్ఞాన హేతుకంబై ఈశ్వర సంతోషణంబును, భక్తి యోగంబును బుట్టించు''నని నారదుడు తెలిపెను. అనగా నిష్కామకర్మవలన భక్తి జ్ఞానములు కలుగును.
సమస్తకర్మలు నాయం దర్పించువారికి ముక్తి నొసగుదునని గీతలో శ్రీకృష్ణు డిట్లు తెలిపెను.
శ్లో|| యేతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః
అసన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే||
గీత 12-6
శ్లో || తేషా మహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్
భవామి న చిరా త్పర్థాః మయ్యా వేశిత చేతసామ్||
గీత 12-7
సమస్తకర్మలు నాయందు సమర్పించి, నన్నే సర్వోత్తమమగు పరదార్థముగ నెంచి, నన్నే బుద్ధియందునిలిపి ధ్యానముచేయుచున్నారో అట్టి చిత్తవృత్తి గలవారిని శీఘ్రకాలములో మృత్యురూపమగు సంసార సముద్రమునుండి తరింపజేయుదును.
శ్రీ రమణమహర్షి ఉపదేశసారములో కర్మ జడస్వరూపము అగుటచేత ఫలము నియ్యజాలదనియు, భగవంతుడే ఫలప్రదాత యనియు, నిష్కామకర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన మోక్షసాధన మగుననియు తెలిపియున్నారు.
కర్తు రాజ్ఞయా ప్రాప్యతే ఫలమ్
కర్మ కింపరం? కర్మ తజ్జడం
''కర్మము ఫలమిచ్చు గర్త్రాజ్ఞవలన
కర్మము దైవమా?కర్మము జడమె.''
దేహాత్మభావముచే తమోగుణయుతుడగు మందాధికారి ఇంద్రియ తృప్తికై పనిచేయును. ''యద్యత్కర్మ కరోతితత్తమ దఖిలం శంభో తవారాధనమ్'' అను భావనతో ''నిజ మనోరథ ఫలదాయ కంబులయ్యును''. ఈశ్వర ''సేవా విరహితంబులై న కార్యంబుల చేయనొల్ల ''ని వారికే వైరాగ్యము సిద్ధించును. ఈశ్వర సేవచే శాంతి లభించును. కామాద్యరిషద్వర్గ లయమే శాంతి గావునను, కామమునకు స్థానములు ఇంద్రియములు మనస్సు బుద్ధి అగుటచేతను, ప్రథమ కర్తవ్య మింద్రియని గ్రహమగుచున్నది.
ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాదిష్ఠాన ముచ్యతే గీత 3-40
ఇంద్రియ నిగ్రహమునకు అనేక మార్గములు సూచించబడినవి. మొదటిమార్గము కుంభక ప్రాణయామము,ఇది ప్రయాస కలిగించు మార్గము; గురువు లేనియెడల ప్రాణాపాయకరము , కొందరు మందాధికారులు కుంభక ప్రాణాయామముచే కాయకల్పసిద్ధిని పొందగోరుదురు. ఇట్టి వారినిరామస్తవరాజము గర్హించినది.
కం|| ప్రాణాయామ జపంబున
మానవులు ధరిత్రియందు మరికొన్నేడుల్
గానంగ బడుదు రింతే
కాని కలదే కాయసిద్ధే కలలోనైనన్
గీ|| కాయసిద్ధి కల్ల గాకున్న నెట్లైన
కన్నవిన్నవారు కలరే ధాత్రి
మూర్ఖులైనవారు మొరుగుచుందురు గాక
అమరులందు నైన అట్లు కలదే?
రామస్తవరాజము
జ్ఞాని తన శరీరము నెక్కుకాలము నిలుపవలెనను ప్రయత్నముచేసిన బంధ మెక్కు వగునని గ్రహించును. తాగినవాడు తన మీది గుడ్డను తెలిసికొనలేనట్లు జ్ఞాని దేహముపై ధ్యాసకలిగియుండడు. మూటల బరువు మోయువాడు గమ్యస్థానముచేరి బరువునెప్పుడు దించుకొనగలనా అని యోచించును. అట్లే జ్ఞాని దేహ మెప్పుడు వదలగలనా అని భావించును.
ఇంద్రియ నిగ్రహమునకు రెండవసాధనము , వానిని విషయవాసనలనుండి దూరముచేయుట, విషయత్యాగము భక్తికి సాధనము వాసనాక్షయము ముక్తికి మార్గము.
శ్లో|| యదా సంహరతే చాయం కుర్మోంజ్గానివ సర్వశః
ఇంద్రియా ణీంద్రియార్ధేభ్య స్తన్యప్రజ్ఞాప్రతిష్ఠితా||
గీత 2-58
తాబేలు తన అవయవములను లోపలికి ముడుచుకొనట్లు, ఎప్పుడు యోగి తన ఇంద్రియముల నన్నింటిని విషయములనుండి మరలించుకొనునో అప్పుడు అతని బుద్ధి నిశ్చలముగును. అనగా వాసనాక్షయముచే తత్త్వదర్శనము చేకూరును.
శ్లో|| విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః
రసవర్జ్యం రసో ೭ప్యస్య పరం దృష్ట్యా నివర్తతే||
గీత 2-59
ఆహారము మాత్రము విడచిన దేహికి విషయములు మాత్రము విడచును గాని వానియందలి అభిలాష విడువదు. పరమాత్మను దలచిన పిమ్మట నా యభిలాషమయు నశించును. అనగా తత్వదర్శనముచే వాసనాక్షయము సిద్ధించును. కావున వాసనా క్షయమునకును తత్త్వజ్ఞానమును పొందుటకును ప్రయత్నింప వలయును.
వాసనాత్రయము ను గూర్చి రాముస్తవరాజ మిట్లు వచించుచున్నది.
గీ|| వాసనాక్షయ మానస వశములేక
తత్త్వబోధంబు తెలియంగ తలపులేదు
అందు నావాసనాత్రయమడచిపుచ్చి
పొందవలె చిత్తజయమున బోధ రూపు.
వ|| అందు వాసనాత్రయ మనోనాశ లక్షణం బెట్లెంటేని
క|| లౌకిక మెరింగి నడవని
పోకలు గారాదటంచు బుధ సభలందున్
లోకానుసారిగా జను
నా కుమతియె లోకవాసనాఖ్యుడు తెలియన్.
గీ|| చదివి చదివి వాటి పదముల యర్థంబు
వెదకి వెదకి కర్మ వివశుడగుచు
వెఱ్ఱివెఱ్ఱి నిష్ఠ వెతనొందుటే జూడ
శాస్త్రవాసనండ్రు సర్వవిదులు.
గీ|| కాయ పోషణంబు గంగా నదీస్నాన
మాదిగాగ గల్గు నఖిల శౌచ
ములును దేహ వాసనలు, మూఢుడగు వాడు
తగిలి నడచుచుండు ధర్మచరితః
చ|| కావున వాసనాత్రయము కష్టపుకర్మము నిందులోపలన్
జీవుడు చెందు లోపముల జెప్పగరోతలు ఎంతమాత్రమే
వావిరి యెంచగా నరకవాసన, మీదట హీనజన్మ, మి
ట్లీ విపరీతముల్ విడువ నెవ్వడెరుంగు నతండే ధీరుండౌ.
ఉ|| లోకము తోడిదెల, సభలో చదువల్ చదువంగగోరు నా
పోకలు బోవనేల, మలమూత్రము కొంపను దాను నాత్మగా
జేకొని సల్పు తీర్థములు శీలములేల నటంచు, వాసనల్
గైకొనకుండువార లధికారులు మోక్షమునందగా, నృపా!
రామస్తవరాజము
''పూర్తిగా వాసనలు జారిపోవుటయే బ్రహ్మమనీ మోక్షమనీ చెప్పబడుచున్నది''. రమణమహర్షి,
పై విచారమునుబట్టి మోక్షసాధనమునకు మందాధికారికి తొలిమెట్టు తమోగుణ నివారణమనియు , తమోగుణముచే జనించిన ఇంద్రియముల నిగ్రహింపవలెననియు ఫలితాంశమబుని విదితమైనది. ఇంద్రియమల నరికట్టుట 1) ప్రాణాయామము చేతగాని 2) ఇంద్రియముల విషయవాసనల నుండి మరలించుట చేతగాని 3) నిష్కామకర్మచేతగాని సాధించవచ్చునని సూచింపబడినది. కాని భాగవతము పామరజన ముల కందుబాటునగల సులభ##మైన మార్గమును సూచించినది.
'' ఇంద్రియంబు లీశ్వర విషయంబులైన''
విదురమైత్రేయ సంవాదము - భాగవతము
అనగా భగవత్సేవా విరహితములైన కార్యములజేయక ఈశ్వరార్పణము బుద్ధితో ఈశ్వరప్రీతికముగా సేవాకైంకర్య రూపమున కర్మల నాచరించవలెననియు దానివలన శాంతి, ఇంద్రియ నిగ్రహము అరిషడ్వర్గ జయము సిద్ధించుననియు తెలుపుచున్నది. ఈ విషయమే వృత్రాసురవధ కథలో సంకేతరూపమున చెప్పబడినదని చిత్రకేతూపాఖ్యానమున నిరూపింతును.
2) రజోగుణము:-
పై విధముగా తమోగుణము తొలగించి ఇంద్రియ నిగ్రహము సాధించిన యెడల మందాధికారి మధ్యమాధికారి యగును. వీనికింకను మనోవిక్షేపదోష ముండును. ఇది రజోగుణమువలన ఏర్పడినది. మనస్సు చంచలమైనది. దానిని నిశ్చలముగను నిశ్చయాత్మకముగను చేసి ఏకాగ్రత పొందవలెనన్న ఉపాసన మంత్రజపములు చేయవలెను. భాగవతమున విదుర మైత్రేయ సంవాదమున
''ఇంద్రయంబు లీశ్వర విషయంబులైన,
మదిసంచిత నిశ్చల తత్త్వమైనచో
సరసిజనాభు కీర్తనమె చాలు
విపద్దశలన్ జయింపగన్'' అని చెప్పబడియున్నది.
త్యాగరాజు''మనసు నిల్పశక్తిలేకపోతే మణిమంత్ర ఔషధములేల? ''యని ప్రశ్నించెను.
మనోనిశ్చలత్వము సాధించుటకుకూడ అనేక మార్గములు కలవు. మొదటిది ఉపాసన, రెండవది మంత్రజపము, మూడవది ప్రాణాయామము, నాల్గవది కుండలినీ సాధన. మూలాధారమునుండి భ్రూ మధ్యమవరకుగల అథఃకుండలిని సాధించినవారికి మనోనిగ్రహహములు కలుగును. ఇవిగాక ఛాందోగ్య ఉపనిషత్తున మధువిద్య, సంవర్గవిద్య మొదలగు 32 విద్యలు చెప్పబడినవి. ఈ విద్యలలో నొకదానినైన అనుభవపూర్వకముగా తెలియజెప్పు గురువులు ఇప్పుడు లేరు. వీని పునరుద్ధరణకై ఏ కారణజన్ముడో పుట్టవలసియున్నది. మనస్సును గూర్చి రామస్తవరాజ మిట్లు తెలుపుచున్నది.
కం|| మనసే సర్వజగంబులు
మనన వ్యతిరిక్తమైన మాయలు గలవే
మనసే సజ్జన సంగతి
గనగా మానస జయంబు గలుగు నృపాలా!
నిద్రలో మనస్సు లయమొందినప్పుడు ప్రపంచములేదు. నిద్ర నుండి మేల్కాంచిన ప్రపంచము గల్గును.
సీ|| మనసయా సంసార మాయా వికారముల్
మనసయా లౌకిక మహిమ లన్ని
మనసయా పాపంబు మనసయా పుణ్యంబు
మనసయా లోకాది మత్సరములు
మనసయా జీవులు మనసయా జనములు
మనసయా సుఖదుఃఖ మలినములును
మనసయా స్త్రీలును మనసయా పురుషులు
మనసయా అఖిలాశ్రమంబు లెల్ల
మనసుగాకున్న దొకటైన మాయ లేదు
మాయగాకున్న దొకటైన మనసులేదు
అఖిలజగము మనోమయ ముగుటదెలిసి
బ్రదుకనేర్చిన వారలు బ్రహ్మ విదులు
- రామస్తవారజము
ఉపవాసాదులచే ఇంద్రియములన చిక్కబట్టినయెడల విషయములపై ప్రసరింపవుగాని మనస్సునకు విషయవాసనలపై అనురాగము నశింపదు. వాసనాక్షయమును గూర్చి ముక్తి కోపనిషత్తున శ్రీరాముడు హనుమంతున కిట్లు ఉపదేశించెను.
శ్లో|| లోకవాసనయా జన్తోః శాస్త్ర వాసనయాపిచ
దేహ వాసనయా జ్ఞానం యధా వన్నైవ జాయతే
లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలచే జ్ఞానము కలుగదు.
శ్లో|| ద్వివిధో వాసనా వ్యూహః శుభ##శ్చై వాశుభశ్చ తౌ
వాసనౌఘేన శుద్ధేన తత్రచే దనునీయసే||
తత్క్రమేణాసు తేనైవ మామకం పద మాప్నుహి.
శుభ వాసనలచే సాధన సలిపిన మోక్షము సిద్ధించును.
శ్లో|| అశుభేషు సమావిష్టం శుభే ష్వవతారయేత్.
అశుభములయందు ప్రవేశ##పెట్టిన చిత్తమును శుభములయందు ప్రవేశ##పెట్టును.
శ్లో|| వాసనాక్షయ విజ్ఞానా మనోనాశా మహామతే
సమకాలం చిరభ్యస్తా భవంతి ఫలదా మతాః
వాసనాక్షయము తత్త్వజ్ఞానము మనోనాశము చిరకాలము అభ్యసించినయెడల ఫలమును గలిగించును.
శ్లో|| జన్మాంతర శతాభ్యస్తా మిధ్యా సంసార వాసనా
సాచిరాభ్యాస యోగేన వినా నక్షీయతే క్వచిత్||
సంసారవాసన బహు జన్మలయందు అభ్యసింపబడినది. అది చిరకాలమునకు గాని నశింపదు.
శ్లో|| తస్మాత్ వాసనయాం మనోబద్ధం విదుర్భుదాః
సమ్యగ్వాసనయా త్యక్తంముక్త మిత్యభిధీయతే||
మనో నిర్వాసనీభావ మాచరాశు మహాకపే!
వాసనాయుక్తమైన మనస్సు బద్ధము. వాసనారహితమైన మనస్సు ముక్తము. మనోనిర్వాసన భావము ఆచరింపుము.
శ్లో || వాసనా సంపరిత్యాగా చిత్తం గచ్ఛ త్యచిత్తతాం.
వాసన వీడుట వలన చిత్తము సంకల్ప రహిత మగును.
శ్లో || అవాసనత్వా త్సతతం యదా నమనుతే మనః
అమనస్తాత్త దోదేతి పరమోపశమ ప్రదా
వాసనలు నశింపజేయుటచే సంకల్ప రహితమైనప్పుడు ఆమన స్కత్వము కలుగును. అప్పుడు పరమశాంతి కలుగును.
శ్లో|| ధృడ భావనయా త్సక్త పూర్వపర విచారణం
యదాదానం పదార్థస్య వాసనా సా ప్రకీర్తితా.
దృఢమైన భావనతో పూర్వాపర విచారణలేక పదార్థములను గ్రహించుట వాసన యగును.
శ్లో|| భావితం తీవ్ర సంవేగా దాత్మ నాయత్త దేవసః
భవిత్యాశు కపి శ్రేష్ఠః విగతేతర వాసనః
అన్యభావము లేనివాడై తీవ్ర సంవేగముతో మనస్సుచే దేనిని భావించునో ఆ వస్తువుగా మనస్సు పరివర్తనమును బొందును.
శ్లో|| తాదృ గ్రూపోహి పురుషో వాసనా వివశీకృతః
సంపశ్యతి యదేవైత త్వదస్త్వితి వి ముహ్యతి.
వాసనా పరవశుడైన మనుజుడు తాదృశ స్వరూపుడై దేవిని గాంచునో అదియే సద్వస్తువని మోహము జెందును.
శ్లో|| వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధాచ మలినా తథా
మలినా జన్మహేతుస్స్యా చ్ఛుద్ధా జన్మ వినాశినీ
బద్ధోహి వాసనాబద్ధో మోక్ష స్యా ద్వాసనాక్షయః
వాసనాం సంపరిత్యజ్యమోక్షార్థిత్వ మపి త్యజ.
వాసనయే బంధమగును. వాసనాక్షయమేమోక్షము. వాసనను వదలి మోక్షవాంచనుకూడ వీడుము.
మనోలయ స్థితిని పొందుటకు సాధనములు:
ఎన్నిప్రదేశములయందు తిరిగినను మనస్సును ఒకే లక్ష్యమందుంచవలయును. శరీరమును నిర్భందముగా ఒకచోట ఉంచి మనస్సును తిరుగునట్లు చేసిన లాభముండదు. సంసారమంటే మన స్సంసారమే, ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే. నేననేదే మనస్సు.దానిరూపము తెలిసికొన ఎట్లు పుట్టినదో ఎక్కడ పుట్టినదో చూడవలెను. రజస్తమోగుణసంపర్కమువలననే ఆభాసమైనను జగత్తును చూచి మనస్సు భ్రాంతి చెందును. అట్టి సంపర్కమును త్రోసివేసిన శుద్ధసత్త్వమేర్పడును. అహమహమని తానుగా ప్రకాశించును. అంతటా బ్రహ్మము గోచరించును. అనన్య శారణాగతి అనగా ఇతర చింతలను వదలి మనస్సుని భగవంతునియందు లగ్నము చేయుట.
శ్రీ రమణ మహర్షి మనస్సు గూర్చి ఇట్లు చెప్పిరి. '' చిదాభాసము అనగా చిత్తునుండి అభాసగా తోచిన అహంవృత్తి. అనగా ఒకటిగా తోచిన అహం(సత్త్వ) వృత్తి రజస్తమోగుణ సంపర్కమువలన మూడై, మూడింటితో పంచభూతోత్పత్తియై, ఆ అయిందింటివల్ల అనే కము కలిగిందని తాత్పర్యము అదే శరీరము నేననే భ్రాంతిని కలిగించును. ఆకాశరూపముగా చెప్పవలసివచ్చిన, చిదాకాశము, చిత్తాకాశము, భూతాకాశమని మూడువిధములుగా నిర్వచనము చెప్పుదురు. చిదాకాశ##మే ఆత్మ, తదాభాసమే (ప్రతిబింబమే) చిత్తాకాశము, అనగా చిత్తమన్నమాట . ఆచిత్తము మనోబుద్ది అహంకారములుగా మారి నప్పుడు అంతఃకరణమందురు. కరణమునగా ఉపకరణమన్నమాట. కాళ్ళుచేతులు మొదలైనవి బాహ్యకరణాలనీ లోపల పనిచేసే ఇంద్రియాలు అంతఃకరణములనీ అందురు. అంతఃకరణములతో కూడిన చిదాబాసుని జీవుడంటారు. వస్తువైన చిదాకాశముయొక్క ఆభాసమైన చిత్తాకాశ##మే భూతాకాశమును చూచునప్పుడు మనోఆకాశమనీ వస్తువును చూచినప్పుడు చిన్మయమనీ చెప్పుదురు. అందులకే '' మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః'' అని చెప్పుదురు. ఆ మనస్సే ఎన్నెన్ని భ్రాంతులనో కల్పించును.
చిన్నవస్తువు కంటికడ్డమైనప్పుడు ప్రపంచమంతయు గోచరింపనట్లు చిన్న మనస్సు బ్రహ్మమునడ్డుకొని గోచరింపనట్లు చేయుచున్నది. శరీరము నిద్రించునపుడు కలలో అనుభవించే కష్టసుభాలు మనస్సే అనుభవించుచున్నది. ఆ మనస్సునే సూక్ష్మశరీరముని యాతనా శరీర మని అందురు. అందులకే రమణ ఉపదేశసారములో
''నష్ట మానసో త్కృష్ఠ యోగినః '' అని చెప్పినారు.
1) మనోలయస్థితి ని పొందుటకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో సంవర్గవిద్యను తెలిపెను. దీనిని ధ్యానయోగములో వివరించెదను.
2) మనోలయస్థితి పొందుటకు భాగవతము రెండుమార్గములను సూచించినది. అందులో మొదటిది అవయవలోపయోగము. దీనిని ముందు పరీక్షిత్తుకథ యందు వివరించెదను.
3) రెండవది భాగవత కథాశ్రవణము, '' ఎవ్వడే యామ్నా యమున్ విన్న మాధవుపై లోకశరణ్యుపై భవములన్ దప్పింపగా జాలు భక్తి విశేషంబు జనించు'' భాగవత శ్రవణముచేయు భక్తులు తన్మయులై
''దివ్యవిలస, దవయవోదార సుందర నవవిలాస
మందహాస మనోహర మధుర వచన
రచనచే నపహృత మనః ప్రాణులగును
నెలమి నుందురు నిశ్శ్రేయ సేచ్చలేక''
భాగవతము 3-879
''మనసు నిలచిన మారుతంబునిలచు'' నను వచనము ప్రకారము భాగవత శ్రవణముచేతనే అపహృత మనఃప్రాణులై నయెడల మనో లయము సిద్ధించును కదా? మనోలయమున కత్యంతసులభమార్గము భాగవత శ్రవణమే యగుచున్నది.
భగవద్గీతలో కూడ భక్తులు తన్మయులై మనఃప్రాణముల తన కర్పింతురని భగవంతు డిట్లు తెలిపెను.
శ్లో|| మచ్చిత్తా మద్గప్రాణా బోధయంతః పరస్పరమ్
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతిచ రమన్తిచ ||
నాయందే మనస్సు నుంచి నాయందే ప్రాణమునుంచి నాచరిత్రలే చెప్పుకొనుచు తెలిసినవారు నాయందే ఆనందించి నాయందే క్రీడసల్పు చున్నారు.
4) సజ్జన సాంగత్యముకూడ మనోలయమునకు ఒక సాధనమే.
కం|| అహ రహ మారూఢమతుల్
మహితులు సన్మార్గులైన మనుజులతోడన్
సహవాస మొనర్చుటచే
సహితము మది లీనమగును స్థానమునందున్
------రమణగీత
భాగవతమున నారదుడు భాగవతుల సాంగత్యమువలన రజన్త మోగుణ పరిహారిణి యగు భక్తి సంభవించెనని చెప్పుకొనెను కదా.
ఒకప్పుడు ఒక ముసలి బ్రాహ్మణుడు రమణమహర్షి కడకు వచ్చి ''స్వామీ! నేను సంసారముపై విరక్తి గలిగి ఈ కొండకు వచ్చి తిని. కాని నా మనస్సు నిశ్చలముగా నుండక జరిగిపోయిన సంసార విషయములనే నెమరు వేయుచున్నది. నా మనస్సునకు ఏకాగ్రత కూర్చి మనోలయస్థితి ఏర్పడునట్లు చేయ ప్రార్థించుచున్నా''నని విన్న నించుకొనెను.మహర్షి అతనిని తన ముందు కూర్చొనజేసి తీక్షణ దృక్కులతో అతనివైపు చూచెను. ఆ బ్రాహ్మణుడు మనోలయస్థితి పొందగలిగి మాటడకనే నమస్కరించి వెడలిపోయెను. కాబట్టి భాగవతుల సాంగత్యము మోక్షదాయకము. మనస్సు అడగి ఒకే వస్తువు కావలెను. దానికి స్వయంప్రయత్న మవసరమని రమణమహర్షి తెలిపెను. అదియే సమాశ్రయణము.
ఇంద్రియ మనోనిగ్రహములు కలవాడు సంసారముననుండియు జనకాదులవలె,. నిష్కామకర్మ నాచరించి తరించవచ్చును. శ్రీరామకృష్ణ పరమహంస ఇట్లు తెలిపెను. ''సముద్రమున నావతేలుచున్నట్లు మానవుడు సంసార సముద్రమున నుండవచ్చును. సముద్రములోని నీవు నావలో ప్రవేశింపరాదు. అట్లే మానవుడు సంసారసాగర మగ్నుడు కారాదు.''
నారదునివలె ఒక భక్తుడు రజస్త మోగుణములను దాటి శుద్ధసత్వగుణుమ కలిగి ఉత్తమాధికారి కాగలిగెనని ఎట్లు తెలిసికొన వీలగును? జ్ఞాన వాశిష్ఠమున ఈ ప్రశ్నకు సమాధానము కలదు. శ్రీరాముడు వశిష్ఠు నిట్లు ప్రశ్నించును. ''ఋష్యాశ్రమమును ప్రవేశించుపులులు సింహములు మొదలగు క్రూరజంతువులు తమ క్రూరత్వమును బాసి జీవహింస సలుపకుండుటకు కారణమేమి?'' దానికి వశిష్ఠు డిట్లు తెలిపెను. '' ఆ ఆశ్రమములో నున్న మహర్షి ఇంద్రియ మనోనిగ్రహములను పొది, రజస్త మోగుణములను జయించి యుండును. అతనికి కేవల శుద్ధ సత్వము ఆవరణము మిగిలియుండును. అట్టిమహర్షి యొక్క శుద్ధ సత్వగుణ ప్రభావముచేత, ఆశ్రమ ఆవరణములోనికి ప్రవేశించిన క్రూరమృగములకు సత్వగుణము మించి రజస్తమోగుణములు మరగుపడును. అప్పుడువి సాత్వికముగానుండి ఇతరులను హింసింపవు. సాధుజంతువులతో ఆటలాడును, కాని ఆశ్రమఆవరణము దాటగానే వాని క్రూరత్వము ప్రకోపించును''. ఇట్టి శక్తి గలవానిని గానిఉత్తమాధికారి యని నిర్ణియింపజాలము. ఇట్టి ఉత్తమమహర్షి లక్షణములు శ్రీరమణహర్షిలో నేటికాలమున అగుపించినవి. అతడాశ్రమ ప్రాంతములోని కోతులమూకల తగవు తీర్చెను. మహర్షి చేతిలో ప్రతిదినము ఒక ఉడుత కూర్చొనుచుండెడిది.
ఉత్తమాధికారి జనకాదులవలె నిష్కామకర్మ నాచరించుచు దేహాంతమున ముక్తిని బొందవచ్చును. లేదా సన్యసించి ఆత్మానాత్మ విచారముచే జ్ఞానియై జీవన్ముక్తుడుగా వచ్చును. ఎప్పుడు సన్యసించవలెననుటకు దేవీగీత ఇట్లు చెప్పుచున్నది.
కొందరుబ్రతికినంతకాలము కర్మచేయవలయునని చెప్పుదురు. వారు
''కుర్వన్నేవహి కర్మాణి జిజీవీషే చ్ఛతగ్‌ం సమాః''
అను శ్రుతివచనమును ప్రమాణముగా జూపుదురు. కొందరు అజ్ఞానము తొలగించుటకు జ్ఞానము తగినదై యుండగా కర్మ ఎందుకలకు చేయవలయునందురు. వీరు
''జ్ఞానాదేవహి కైవల్యమ్'
అను శ్రుతివచనము ప్రమాణముగా వచింతురు. కొందరు రెండును అనగా కర్మచేయుచు జ్ఞాన మార్జించవలెనని చెప్పుదురు. (జ్ఞాన కర్మ సముచ్చయవాదము బాలగంగాధర తిలక్‌గారు సమర్థించిరి. పండితుల మధ్య అనేక వాగ్వాదములు జరిగినవి.) ఎందుకనగా వేదమున కర్మ చేయవలయును. జ్ఞానము సంపాదించవలయును. అని రెండు విధులు చెప్పబడినవి కదా! ఈ ప్రశ్నకు సమాధానము దేవీగీతలోనే చక్కగ వివరింపబడినది. సన్యసించు టెప్పుడోకూడ నిర్ణయింపబడినది.
శ్లో|| అనర్థదాని కర్మాణి పునః పున రుశన్తి హి
తతో రాగ స్తతో ద్వేష తతో೭ నర్ధో మహాన్ భ##వేత్.
దేవీ గీత 3-10
తస్మాత్ సర్వప్రయత్నేన జ్ఞానం సంపాదయే న్నరః
దేవీ గీత 3-11
కర్మలు వాసనారూపముగ నుదయించుచున్నవి. మాటిమాటికి జననమరణ రూప అనర్థము కలిగించుచున్నవి. వానివలన అనురాగము కలుగును. ద్వేషము కలుగును. ఆ రాగద్వేషమువలన నరకాది అనర్ధములు కలుగును. అందువలన కొందరు మానవుడు సర్వప్రయత్నములజేసి జ్ఞానమును పొందవలెనని చెప్పుదురు.
శ్లో|| కుర్వన్నేవహి కర్మాణి త్సతః కర్మా ప్యవశ్యకమ్
దేవీ గీత 3-11
బ్రతికినంతకాలము కర్మచేయుమని వేదమే చెప్పుచుండుట చేత కర్మయు చేయవలసియున్నది. కావున కర్మజ్ఞానములు రెండును యావజ్జీవ మనుష్టించవలెనని అర్థము.
శ్లో|| జ్ఞానదేవహి కైవల్య మతిస్స్యా తత్సముచ్చయః
సహాయతాం వ్రజేత్ కర్మ జ్ఞానస్య హితకారిచ||
దేవీ గీత 3-12
ఇతికేచి ద్వదన్త్యత్ర తద్విరోధా న్నసంభ##వేత్
దేవీ గీత 3-13
అజ్ఞానమును తొలగించుటకు జ్ఞానమే తగినదై యుండగా కర్మ మేమి చేయునని శంకింపరాదని, జ్ఞానమునకు కర్మ సహాయకారియగు నని, కాన కర్మతో జ్ఞానముకు కూడిక తగినదేయని కొందరు చెప్పుదురు.
శ్లో || జ్ఞానా ద్దృద్గ్రంధి భేదస్స్యా ద్ధృద్గ్రన్దేః కర్మసంభవః
¸°గపద్యం న సంభావ్యం విరోధాస్తు సతస్తయోః
తమః ప్రకాశయో ర్యద్యద్యౌగపద్యం నసంభవి
దేవీ గీత 3-14
మనస్సు, దేహాది ఉపాదులు, వీని సాక్షియగు ఆత్మచైతన్యము ఈ రెండింటిని ఒకటిగా నెంచుట హృదయగ్రంధియగును. ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు హృదయగ్రంధి నాశనమగును. నేను బ్రాహ్మణుడను. మానవుడనను తలంపు రూపముగాగల హృదయగ్రంది యుండిననే కాని కర్మ నిలువజాలదు. హృదయగ్రంధి వీడిన దేహాది ఉపాధులకు మనస్సునకు చెప్పబడిన కర్మలతో ఆత్మజ్ఞానికి పనియేమి? కర్మ అజ్ఞాని నుద్దేశించి చెప్పినదే కాన జ్ఞానకర్మ లోకచోట కలిసి యుండవు. జ్ఞాని లోక సంగ్రహార్థము కర్మల నాచరించినను, అది ఫలాపేక్షతో చేయబడదు. కాబట్టి అది కర్మకాదని శంకరులు గీతా భాష్యమున తెలిపిరి. అందువలన జ్ఞానకర్మలు ఒకచోట యుండవు. అవి సరస్పర విరుద్ధము లగుటచేత చీకటి వెలుగుల వలె ఒకచోట నుండవు. కాన యావజ్జీవము కర్మ చేయవలెననుట అజ్ఞానులను గూర్చి చెప్పినదే.
శ్లో|| తస్మాత్ సర్వాణి కర్మాణి వైదికాని మహామతే
చిత్త శుద్ధ్యంత మేనస్యు స్తాని కుర్యాత్ప్రయత్నతః
దేవీ గీత 3- 15
వైదిక కర్మలన్నియుచిత్తము పరిశుద్ధము పొందుటకొరకు చెప్పబడినవి. కాన చిత్తశుద్ధి పర్యంతము శ్రద్ధతో చేయవలయును.
శ్లో || శమో దమస్తితి క్షాచ వైరాగ్యం సత్త్వ సంభవమ్
తావ త్పర్యంత మేనస్యుఃకర్మాణి నతతః పరమ్
దేవీ గీత 3-16
మనస్సునునిల్పుట, బాహ్యేంద్రియములను విషయములనంట నీయక నిరోధించుట, చలి ఎండ సుఖదుఃఖముల సహించుట, ఐహిక పరలోకసుఖములు గోరకుండుట, అంతఃకరణమునగల సత్త్వము , రజస్తమో భావరహితమై పరిశుద్ధసత్త్వమగుట ఇట్టి జ్ఞానాంగ సంపత్తి కలుగువరకే కర్మల నాచరింపవలెను.
శ్లో|| తదంతే చైవ సన్యస్య, సంశ్రయే ద్గురుమాత్మవాన్
శ్రోత్రియం బ్రహ్మ నిష్ఠంచ భక్త్వా నిర్వ్యాజయా పునః
దేవీ గీత 3-17
చిత్త శుద్ధి కలిగిన పిదప సన్యసించి '' సన్యస్యశ్రవణం కుర్యాత్'' సద్గురువద్ద వేదాంత శ్రవణము చేయవలయును. నిష్కపటమైన భక్తితో గురువు నాశ్రయించవలెను. (పరిప్రశ్నేన సేవయా- భగవద్గీత)
శ్లో|| వేదాంతశ్రవణం కుర్యాత్ నిత్యమేవ మతంద్రితః
తత్త్వమస్యాది వాక్యస్య నిత్య మర్థం విచారయేత్
దేవీ గీత 3-18
వేదాంత శ్రవణముచేసి తత్త్వమస్యాది వాక్యముల విచారించవలయును.
శ్లో || ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః
అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్||
భగవద్గీత 6-45
ప్రయత్నమువలన యోగమునందు కృషి యొనర్చుచుండు యోగి యొక జన్మమున తరింపకపోయినను క్రమముగా అనేక జన్మములనెత్తి తుదకు యోగసిద్ధిని బొందు ముక్తిని బొందును.
శ్లో || బహూనాం జన్మనా మంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సు దుర్లభః
భగవద్గీత 7-19
అనేక జన్మములెత్తి జ్ఞానము సంపాదించి, సర్వమును వాసుదేవుడే యని తెలిసి పరమేశ్వరుడగు నన్ను జేరుచున్నాడు. అట్టి మహాత్ముడు అరుదైనవాడు.
''వాసుదేవ స్సర్వమితి'' అను పై శ్లోకములోని వాక్యము ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' అను శ్రుత్యర్థమును సూచించుచున్నది.
సత్వగుణము:- ఇంద్రియ మనోనిగ్రహములు కలిగిన తర్వాత, అనగా రజస్తమోగుణపరిహారిణియగు భక్తి ఏర్పడిన తరువాత ఉత్తమాధికారియైన మానవునకు శుద్ధ సత్వగుణము మిగిలియుండును. దీనివలన ఆవరణము లేదా నీవు నేనను భేదబుద్ధి ఏర్పడును, ప్రథమ మద్యమ ఉత్తమ పురుష లేనివాడు భగవంతుడు, నమ్మాళ్వారు ఇట్లు తెలిపెను.
'' నన్ను నే నెఱుగక నేను నాది అంటిని. తరువాత నేను నీవని నాది నీదని తెలిసికొంటిని.''
గీ|| నేను గలిగిన నీవును గానబడుదు,
నేను నీవును గలిగిన నిగుడు జగము
నీవు నేనును ఒకటైన భావ మెపుడు
గాన బడునట్టి కాలంబు దీని కవధి.
-----రామస్తవరాజము
ఉత్తమాధికారి ఆవరణము తొలగించుకొనుటకై సంప్రదాయమార్గమెరిగిన గురవునాశ్రయించి సంప్రదాయసిద్ధమైన వ్యాఖ్యానమును అభ్యసించవలెను. ''అహం బ్రహ్మాస్మి'' నేను బ్రహ్మమును అని ఉచ్ఛరించినను, లేక తర్కబలముతో సాధించినను ఫలితము లేదు. ''బ్రహ్మైవాహమస్మి'' ఆ బ్రహ్మము నేనను అనుభవాజ్ఞానము కలుగవలెను. మొదటిది శాస్త్రపఠన జస్య జ్ఞానముమాత్రమే. అనుభవ జ్ఞానము పొందప్రయత్నించవలెను. ఇవియే భగవద్గీతలోజెప్పిన జ్ఞాన విజ్ఞానములు, భగవంతుడర్జునకు సాంఖ్యము తెలిపి తర్వాత అనుభవ పూర్వకముగా తెలియుటకు యోగములను తెలిపెను.
శ్రీ వాశిష్ఠ గణపతిముని శ్రీ రమణమహర్షి నిట్లడిగెను.
కం|| జ్ఞానసమ్మెది మునికుంజరః
ఏనగుదున్ బ్రహ్మమనెడి వృత్తియొ? బ్రహ్మంబెనను బుద్ధియొ? సర్వం
బేనను బుద్ధియొ? మహాత్మఎరిగింపగదే.
కం|| సకలము నిది బ్రహ్మంబను
టొకొ యిల జ్ఞానమ్ముగా బ్రయుక్తము;క పై బే
రుకొనిన వృత్తులు నాల్గిం
టికంటెనున్ జ్ఞాన మారయ నెగడునె వేరై||
--రమణగీత
దీనికి బదులుగా శ్రీ రమణమహర్షి ఇట్లు తెలిపెను.
కం|| ఈ వృత్తులు సకలమ్ములు
భావనలే, సందియమ్ము పనిలేదు, స్వరూ
పాపవస్థిత శుద్ధమ్మును
గోవిదు లిల జ్ఞాన సంఖ్యగొని వచియింతుర్.
ఇట్టి ఆత్మజ్ఞానము సిద్ధించిన ఉత్తమాధికారికి సత్వగుణము కారణదేహముఆవరణము తొలగిపోవును.
శ్రీ రమణమహర్షి ఆత్మానాత్మ విచారముతోడనే గాక ధ్యాతకు కూడ ఆత్మానుభూతి కలుగనని తెలిపియున్నాడు. ధ్యాత ఏకవస్తుచింతనముచేత ఆత్మానుభూతి పొందగలడని తెలిపెను.
కం|| ఏకమ్మును ధ్యానింపగ
నేకాకృతి యగును జిత్త మేకాకృతిగా
నీకరణి జిత్తమునకును
సాకల్యముగా స్వరూప సంస్థితి గులుగున్
కం|| కోరకయే మనుజుడు సం
స్ఫార ధ్యానమున నాత్మ సంస్థితి నొందున్
ధారుణిలో, నిక నాత్మవి
చారకుడో ఎఱిగి ఆత్మ సంస్థితుడ యగున్.
కం|| ఈ రీతిని గతి ఏకమె
ధ్యాతయు స్వవిమర్శకుడు నను నిరువుకున్
-రమణగీత
ధ్యానము చేయువానికిని, ఆత్మానాత్మ విచారము చేయువానికి ని గతి ఏకమని రమణమహర్షి అభిప్రాయము.
నిష్కామకర్మ భక్తి అవలంబించినగాని శాంతి కలుగదు. తొలుతనే జాననిష్ఠ కలుగుట సాధ్యముకాదు.
గీ|| కర్మ భక్తులతోడను క్రమముతోడ
చిత్త విశ్రాంతి నొందును శీఘ్రమందె
కావునను కర్మభక్తులు జీవునకును
సేయవలసిన కార్యంబు సిద్ధమయ్యె.
-- రామస్తవరాజము
ఆత్మానుభూతిలేని కేవల వాచా వేదాంతముకూడ నిరర్థకమని కూడ రామస్తవరాజము హెచ్చరించుచున్నది. వాచావేదాంతి తన వలెనే అనుభవజ్ఞానము లేని వేరొక వాచా వేదాంతినే తయారు చేయుచున్నాడు.
సీ|| బ్రహ్మంబు నేనని పలుమారు ననవచ్చు
బ్రహ్మబోధ మెఱుంగు భావమరుదు
వేదాంతశాస్త్రముల్ విభజించిపగా వచ్చు
నాత్మధర్మము తెల్పు టదియు నరుదు
సర్వంబులును రోసి సన్యాసి ననవచ్చు
శూన్యమార్గంబులో జొచ్చుటరుదు.
ఇవి బంధ మోక్షంబు లని జెప్పగావచ్చు
తానుగా నిలకడ దనరు టరుదు.
గీ|| తనువు నర్థంబు గురునికి ననగవచ్చు
దారి మొనసిన లోభంబు దీరు టరుదు
మనసు సామర్థ్య మెరిగెడి మర్మమరుదు
అంత తానయ్యు గాకుండు టదియు నరుదు.
గీ|| శుష్క వేదాంత సిద్ధాంత సూరి వరులు
ఆత్మ తెలియక నర్ధముల్ వ్యర్థముగను
జెప్పుచుందురు లోకుల జెరచుకొరకు
నిజము నిష్ఠూరమై కల నిజములాయె.
--రామస్తవరాజము
శంకర రమణాదులు చిన్నతనమునే స్వల్పకాలమున జానము సాధించిరి కదా యని ప్రశ్నించవచ్చును. కారణజన్ములై బహు జన్మార్జిత సంస్కారముతో జనించిన వారితో సామాన్యులు పోల్చు కొనరాదు. కారణజన్ములకు గురువుతో కూడ పనిలేదు. మనము ఒక వస్తువును చూచుటకు కన్ను, దీపము రెండునూ కావలెను. దీపము అజ్ఞానాంధకారము తొలగించు గురువుతో సమానము.కాని పిలి దీపము లేకయే చూడగలదు. అట్లే కొందరికి పూర్వజన్మ సంస్కారమువలన గురువు లేకయే ఆత్మానుభూతి కలుగును. గబ్బిలము కన్ను లేకయే చూడగలదు. అట్లే జ్ఞాని కన్నులు మూసికొనియు చూడ గలడు. కారజన్ములను జ్ఞానులను సామాన్య మానవులుగా భావించరాదు. పై విధముగా త్రిగుణములను తొలగించుకొనుటయే ముక్తిహేతుకమైన భాగవత భక్తి మార్గము.
అనుష్టింపదగిన భక్తి ఎట్టిది(సాత్వికభక్తి):----
జ్ఞానాదేవహి కైవల్యమ్'' అనగా జ్ఞానముతోడనే ముక్తి కలుగునని శంకరులు తెలిపిరి. దేవీగీతలో వైరాగ్యమున్నను భక్తిలేని ఎడల జ్ఞానము దుర్లభమని శ్రీదేవి తెలుపుచున్నది. వైరాగ్యములేని వానికికూడ భక్తియెగము చే జ్ఞానము సిద్ధించునట.
శ్లో || స్వీయాం భక్తి వదస్వాంబ యేన జ్ఞానం సుఖేనహి
జాయతే మనుజ స్యాస్య మధ్యమ స్యావిరాగిణిః
దేవీగీత 6-1
వైరాగ్యమున్నను భక్తి లేనివానికి దుర్లభమగు జ్ఞానము వైరాగ్యము లేనట్టి మందాధికారికి కూడ యే భక్తి యోగముతో సుఖముగా కలుగునో అట్టి నీ భక్తి యోగము వచింపుము.
భగవద్గీతలో చెప్పినట్లుగనే దేవీగీతలో ముక్తిని బొందుటకు మూడుయోగములు తెల్పబడియున్నవి.
శ్లో || మార్గాస్త్రయో మే విఖ్యాతా మోక్షప్రాప్తే నగాధిప!
కర్మయోగో జ్ఞానయోగో భక్తియోగశ్చ సత్తమ.
దేవీ గీత 6-2
సాయుజ్యముక్తి లభించుటకు కర్మజ్ఞాన భక్తియోగములను మూడు మార్గములు చెప్పబడినవి. జ్ఞానయోగమునందు సాధనాంతర ఆపేక్షలేకయే స్వయముగా మోక్షము నొసగును. కర్మభక్తియోగము లన్నచో చిత్తశుద్ధి కలిగించి జ్ఞానమును కలిగించి మోక్షము నొసగును.
పై మూడు యోగములలో భక్తి యోగమే సులభము
శ్లో || త్రయాణా మప్యయం యోగ్యః కర్తుం శక్త్యో೭ స్తి సర్వదా
సులభత్వా న్మానసత్వా త్కాయ చిత్త ద్యపీడనాత్
దేవీగీత 6-3
ఈ మూడు యోగములలో భక్తియోగము సులభ##మైనది. శరీరాయాసము ధనవ్యయము లేనిది. పరమప్రేమరూప మగుట చేత హృదయముచేత నిర్వహింపబడునది.
శ్లో || గుణబేధ న్మనుష్యాణాం సాభక్తి స్త్రి విధా మతా
దేవీ గీత 6-4
మానవులయొక్క సత్వ రజస్తమోగుణ భేదములవలన మంద మధ్యమ ఉత్తమాధికారుల భక్తి మూడు విధములుగ నున్నది.
భక్తి
1) తామసిక భక్తి అభేదక భక్తి నవవిధ
2) రాజసిక భక్తి అనన్యభక్తి భక్తులు.
3) సాత్విక భక్తి ఆత్యంతిక భక్తి
4) (నిర్గుణ భక్తి) (పరాభక్తి)
భగవద్గీతలోను దేవీగీతలోను పై వర్గీకరణములోని మొదటి వర్గమునకు చెందిన భక్తి భేదములు వివరించబడినవి. అన్నియు విపులముగా భాగవతమున చెప్పబడినవి. తామసిక రాజసిక సాత్విక అనన్యభక్తులు కపిలుడు తెలిపెను. దక్షయజ్ఞమున అభేదభక్తి వివరింపబడినది. భగవద్గీతలో అనన్యభక్తి చెప్పబడినది. (అనన్యాశ్చితంయంతో మాం) అనన్యచేత స్పతతం)
పై భక్తి భేదములన్నియు '' ఇంద్రియంబు లీశ్వరవిషయంబు లైన, మదిసంచిత నిశ్చల తత్త్వమైనచో'' అను భాగవత వచన భావమును సమర్థించున్నవని నిరూపింతును.
తామసభక్తి:
గీ|| సతత హింసాతి దంభ మాత్సర్యరోష
తమములను జేయుచును భేదదర్శి యగుచు
పరగ నాయందు గావించు భక్తి దలప
తామసంబగు
భాగవతము 3-952
కపిలుడు దేవహూతికి పై విధముగా తామరభక్తిని గూర్చి తెలిపెను. ఈ భక్తి తమోగుణ ప్రధానమై హింస, దంభ, మాత్సర్య, రోషములచే కూడియుండను. తామసభక్తున కభేద దృష్టి యుండదు. శివకేశవులు వేరను భేదబుద్ధి యుండును.
తామసభక్తిని గూర్చి దేవీగీత ఇట్లు తెల్పుచున్నది.
శ్లో|| పరపీడాం సముద్దిశ్య దంభం కృత్వా పురస్సరమ్
మాత్సర్య క్రోధయుక్తోయస్తస్య భక్తిస్తు తామసీ
దేవీగీత 5-6
పరుల పీడింపదలచి ఇతరుల మెప్పు బడయుటకై మాత్సర్యము క్రోధముకలిగి నన్ను ప్రార్థించు వానిభక్తి తామస భక్తి. ఈశ్వరుడు సత్వంబున దేవఋషులను,రజోగుణంబున నసురులను, దమోగుణం బున యక్షం రక్షోగణంబులను విభజించె.
-భాగవతము సప్తమస్కంధము 7-7
తమోగుణ ప్రధానులైనవారు రాక్షసులని, రజోగుణ ప్రధానులైనవారు అసురులనియు భాగవతమున ప్రహ్లాద చరిత్రమున చెప్పబడినది. వీరిని చంపుటకై వరహా, నారసింహ, రామ కృష్ణ అవతారములను శ్రీహరి దాల్చెను. వరాహ నారసింహులు హిరణ్యాక్ష హిరణ్య కశిపులను, శ్రీరాముడు రావణ కుంభకర్ణులను శ్రీకృష్ణుడు శిశుపాల దండవక్తృలను చంపిరి.
భాగవతమున హరిణ్యాక్ష హిరణ్యకశపుల వధయు, రామయణమున రావణ కుంభకర్ణులవధయు, భారతమున శిశుపాలదంతవక్తృల వధయు చెప్పబడినది. ఇందులో హిరణ్యాక్ష కుంభకర్ణ దంతవక్తృలు తమోగుణ ప్రధానులగు రాక్షసులు. హిరణ్యకశిపుడు, రావణుడు, శిశుపాలుడు రజోగుణ ప్రధానులైన అసురులు. రజస్తమోగుణ నిర్మూలనమే మూడు పురాణముల యందలికథ. వీరికి మూల పురుషులు జయవిజయలు. వైకుంఠమున శ్రీహరి ద్వారపాలకులు జయవిజయులు. వీరే రజోగుణ తమోగుణములని భావించవచ్చును.
శుద్ధ సత్త్వగుణ ప్రధానులైన సనకస నందనాదులు ఒకప్పుడు శ్రీహరి దర్శనమున కరుదెంచిరి. జయవిజయులు రజస్త మోగుణ సంకేతము గలవారగుట వారిని అడ్డగించిరి. అనగా శ్రీహరి సాక్షాత్కారమును పొందుటకు లేదా ఆత్మసాక్షత్కారణమునకు రజస్తమోగుణములు ప్రతిబంధకములు. శుద్ధ సత్వమున్నగాని ఆత్మసాక్షాత్కారము కలుగదు. సత్వగుణ ప్రధానులైన సనకస నందనాదులకు హరిదర్శనమున కడ్డులేదు. అందువలన వారు జయవిజయులను మూడు జన్మలెత్తునట్లు శపించిరి. వారే హిరణ్యాక్ష హిరణ్యకపుశిలు, రావణ కుంఫతర్ణులు శిశుపాల దంతవక్తృలు. మధుకైటభులుకూడ ఇట్టివారే. వీరే రజస్త మోగుణములు. రజస్తమోగుణ పరిహారిణియగు సాత్విక భక్తియే నారదునకు కలిగెనని భాగవతము సూచించినది.
రావణుడు భేదదర్శియై విష్ణువుపై ద్వేషబుద్ధితో వామాచార వీరసాధనతో తలలను తెగగోసి హోమగుండమున వైచి ఈశ్వరుని మెప్పించెను. తాను బ్రాహ్మణుడయ్యును, తామసభక్తుడు, కామాద్యరిషడ్వర్గములు నశించలేదు. అయినను అతనిభక్తి అనన్యసాధ్యము అతడు మహాభక్తుడు. రావణోక్తమైన మహన్యాసమునే మన మను సరించుచున్నాము.
ఇట్టి తామసభక్తి కి కారణమైన విషయములను శంకరాచార్యులు షణ్మతములనుండి తొలగించెను.
శ్లో|| అలింగాంక మచక్రాంక మసురాస్థి ఝషామిషం
అనుచ్చిష్ట మరక్తంచ మతం శంకర సమ్మతమ్
అకపాలమైన కాపాలికమతమును, లింగధారణలేని శైవమును చక్రాంకితములేని వైష్ణవమును. మద్యమాంసరహితమైన శాక్తమును రక్తతర్పణము లేని సౌరమును, ఉచ్చిష్టముకాని గాణాపత్యమును, ప్రచారముచేసి శంకురులు తామస ధర్మములుగల మతములను సంస్కరించెను.
రాజసభక్తి:-
కం|| #9; ఘన విషయ ప్రావీణ్యము
లను, సమహైశ్వర్య యశములను, బూజా ద్య
ర్హుని, ననునర్థి భజించుట
చను రాజసయోగ మనగ
-భాగవతము 3-954
రాజసభక్తుడు విషయ వాంఛలు కలిగి, ఐశ్వర్యమును కీర్తిని గోరి భగవంతుని ప్రార్థించును.
దేవీగీతలో రాజసభక్తి ఇట్లు నిర్వచింపబడినది,
శ్లో|| పర పీడాది రహితః స్వకల్యాణార్థ మేవచ
నిత్యం సకామో హృదయే యశో7ర్థీభోగలోలుపః
తత్తత్ఫల సమారాపై#్త్య మాముపాస్తే7తి భక్తితః
భేద బుధ్యాతుమాం స్వస్మా దన్యాం జానాతి పామరః
తస్య భక్తిస్స మాఖ్యాతా నగాధిపతు రాజసీ||
దేవీగీత 6-5,6,7
పరులను పీడింపక, తన శుభమును కోరి కీర్తికాముడై భోగా సక్తుడై ఫలములను పొందుటకు భక్తితో నన్ను కొలుచును. భేదదర్శనముతో నన్ను తనకంటె వేరుదానినిగా భావించును. అట్టివాని నకామభక్తి రాజసభక్తి యనబడును.
రాజసభక్తుని ఆశాకు మేరలేదు. అందులకే భాగవతమున ఇట్లు చెప్పబడినది.
శా|| ఆశాపాశము తా కడున్ నిడుపు లేదంతంబు రాజేంద్ర వా
రాశి ప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యంబు జేకూరియున్
గాశిం జెందిరిగాని వైన్యగయ భూకాంతాదులు న్నర్థ కా
మాశన్ బాయగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.
భాగవతము 8-557
సాత్వికభక్తి:
చ|| అనుపమ పాపకర్మ పరిహారముకై భజనీయుడైనశో
భన చరితుండితం డనచు భావమునన్ దలపోసి, భక్తిచే
అనితర యోగ్యతన్ భగవదర్పణ బుద్ధి నొనర్చి కర్మముల్
జనహితకారియై నెగడ సాత్వికయోగ మనంగ జొప్పడున్.
భాగవతము 3-955
పరోపకార పారీణుడై మానవసేవయే మాధవసేవ యను భావముతో నిస్స్వార్థపరుడైన వాని భక్తి సాత్వికభక్తి, గాంధీ మాహాత్ముని ఇట్టి భక్తున కుదాహరణముగా చెప్పవచ్చును. రజస్తమోగుణ పరిహారిణి యగు సాత్వికభక్తి జ్ఞానోదయమునకు దారితీయును. నిర్గుణ పరబ్రహ్మమును సగుణోపాసన ద్వారా సాత్విక భక్తి యోగము భాగవతము చెప్పబడినది.
''సత్వాత్ సంజాయతే జ్ఞానమ్''
దేవీగీతయందు సాత్వికభక్తి నిర్వచనమును పరిశీలింతము.
శ్లో|| #9; పరమేశార్పణం కర్మ పాప సంక్షాళనాయచ
వేదోక్తత్వా దవశ్యం తత్కర్తవ్యం తు మయా೭నిశమ్
దేవీగీత 6-8
శ్లో|| ఇతి నిశ్చిత బుద్ధిస్తు భేదబుద్ది ముపాశ్రితః
కరోతి ప్రీతయే కర్మ భక్తి స్సా నగ సాత్వికీ ||
దేవీగీత 6-9
పాపములు తొలగుటకొరకు వేదమున సత్కార్మానుష్ఠానము విధింపబడెను. అది వర్ణాశ్రమముల ననుసరించు కర్తవ్యము. ఇ శ్చయముతో జీవేశ్వరులయందు భేదబుద్ధి కలిగి నన్ను తృప్తి పరచుటకొరకు చేయబడు భక్తి సాత్వికభక్తి.
శ్లో|| పరభ##క్తేః ప్రాప్తి కేయం భేద బుధ్యవలంబనాత్
పూర్వప్రోక్తే హ్యుభే భక్తి న పరప్రాప్తి కే మతే ||
దేవీగీత 6-10
సాత్వికభక్తి పరాభక్తి ని పొందించును. పరాభక్తి యనగా ''సాపరానురక్తీ రీశ్వరే'' సర్వేశ్వరుని యందు చూపబడు నిరతిశయప్రేమ. కావున సాత్వికభక్తి అనుష్ఠింపదగినది. సత్వగుణమున సద్భుక్తిసంభవించు, భక్తియుతముగ జిత్తంబు భవ్యమగును.
భాగవతము 3-428
రాజసిక తామసికభక్తులు పరాభక్తిని కలిగింపవు గాన వానిని త్యజించవలెను. సాత్వికభక్తియే పరాభక్తి ఎందులకు కాకూడదు?
''తదేత త్ప్రేయఃపుత్త్రా త్ప్రేయో, విత్తాత్ త్ప్రేయ సర్వస్మా దంతర తరం'' - శ్రుతి
ఆత్మవస్తువు పుత్రునికన్న ప్రియమైనది. ధనముకన్న ప్రియమైనది. అన్నిటికంటె ప్రియమైనది.
సాత్వికభక్తియందు తనకంటె భగవంతుడు వేరనుభావమున్నది. కాన అది పరభక్తి కానేరదు. ఒక సూఫీ సిద్ధాంతిని పాపమనగా ఏమని ప్రశ్నింపగా ఇట్లు బదులు చెప్పెను. ''నేనువేరు భగవంతుడు వేరు అనుకొటయే పాపము.''
నిర్గుణ భక్తి:
గుణత్రయాతీతమైన భక్తిని నిర్గుణభక్తి యని భాగవతము పేర్కొనుచున్నది. దీనినే అత్యంతికభక్తిగా ముందు తెలిపితిని.
మద్గుణ శృతిమాత్రేణ మయి సర్వగుహాశ##యే
శ్లో|| మనోగతి రవిచ్ఛిన్నా యథా గంగాంభసో7మ్పుథౌ
లక్షణం భక్తి వయోగస్య నిర్గుణస్యహ్యుదాహృతమే
é భాగవతము 3-29-11,12
గంగా ప్రవాహము అఖండముగా సముద్రమువైపునకు ప్రవహించునట్లు నా గుణ శ్రవణమాత్రముననే మనోగతితై లధారవలె అవిచ్ఛిన్నమై సర్వాంతర్యామి నగు నన్ను ధ్యానించవలెను. నాయందు నిష్కామము అనన్యము అగు ప్రేమ ఏర్పడవలెను. దీనిని నిర్గుణ భక్తి యోగలక్షణమని చెప్పుదురు.
శరణాగతి:- భక్తుడు తన ఆస్తిని భగవంతున కర్పించవలెను.తాను చేయు కర్మలన్నియు భగవంతుడు చేయుచున్నాడని భావించవలెను. తన ఆత్మ సమర్పణము గావించుకొనవలెను. అన్ని మతములు భగవంతుని శరణుపొందుమని తెలుపుచున్నవి. ఉదాహరణమునకు ''ఇస్లాం'' అనగా శరణాగతి అని అర్థము.
అభేదభక్తి:-
ఇంతకుముందు భగవంతుడెవరు? అను ప్రశ్నను వివరించునప్పుడు శివకేశువులపై పోతన ఎట్లు అభేద ప్రతిపత్తి కనబరచెనో తెలిపియుంటిని. శివకేశువలే కాదు సర్వదేవతలు ఆదిరనారాయణుని అంశ##లే. భేదబుద్ధికల దక్షుడెట్లు శిక్షింపబడెనో తెల్పు భాగవత కథను తెలిపియుంటిని, శివకేశవుల యందేకాక ఏ అవతారమూర్తి యందును భేదబుద్ధి తగదు.
శ్లో|| జన్మ కర్మచ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః
త్యక్త్వాదేహం పునర్జన్మ వైతి మామేతి సో7ర్జున!
గీత 4-9
అర్జునా! ఎవడు దివ్యమైనట్టి నా జన్మను కర్మ నిశ్చయముగా దెలిసికొనునో, అట్టివాడు శరీరమును విడిచిన పిదప మరల జన్మమును బొందక నాలో నైక్యమగును. అనగా రామకృష్ణాది అవతారములన్నియు ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతునివే అని భావము.
హరికథలు చెప్పువారు కొన్నికథలను చెప్పి మనకు భేదదృష్టిని కలిగింతురు. ఉదాహరణమునకు సమీర కుమార విజయములోనికథను పరిశీలింపుడు. ఈకథ గరుడ గర్వభంగమునకు సత్యభామ గర్వభంగమునకు ఉద్దేశించినది. హనుమంతుని పిలచుకొవి రమ్మని శ్రీకృష్ణుడు గరుత్మంతుని గంధమాదన పర్వతమున కనిపెను. ధ్యానమగ్నుడైన హనుమంతుని గాంచి గరుడుడు "నిన్ను శ్రీకృష్ణుడు రమ్మని కోరె" నని తెలిపెను. కాని హనుమంతుడు బదులు పలుకలేదు. అతడు తోకను తనచుట్టు చుట్టుకొని లోన కూర్చొనియుండెను. గరుత్మంతుడతని తోకను ముక్కుతో పొడిచి కదలింప బూనెను. హనుమంతుడు గరుడుని ముక్కును తోక సందున ఇరికించి అతనిని తిప్పలు బెట్టెను. అతికష్టముమీద ముక్కును బయటకులాగి గరుత్మంతుడు శ్రీకృష్ణుని కడకేగి హనుమంతుడు వచ్చటకు నిరాకరించెనని తెల్పెను. శ్రీకృష్ణుడు గరుత్మంతునితో "శ్రీరాముడు నిన్ను పిలచుచున్నాడు" ని హనుమంతునితో తెలుపుమని ఆదేశించెను. గరుత్మంతుడట్లు సేయగా రామనామము వినినంతనే హనుమంతుడు త్వరితముగా గరుడుని వెంటవచ్చెను.
హనుమంతడు రామదర్శనము తప్ప ఇతరము కోరడని ఎరిగిన శ్రీకృష్ణుడు తాను రామావతారమును బూనెను. సత్యభామ లక్ష్మీఅంశ సంభూతురాలు కాదు. అందుచే సీతరూపమును ధరింసజాలదయ్యెను. రుక్ముణీదేవి సీతగా మారెను.
శ్లో|| #9; రాఘవత్వే భవత్సీతా రుక్మిణీ కృష్ణ జన్మని
సర్వేషు చావతారేషు విష్ణోరేషా೯న పాయినీ ||
ఆ హనుమంతుడు సీతారామ దర్శనమున తృప్తుడయ్యెను. హనుమంతున కట్టి భేదదృష్టి లేనప్పటికిని మూఢభక్తికి ఉదాహరణముగా ఏకవస్తు చింతనముచే ఏకాగ్రత కలిగించుటకై ఈ కథ చెప్పబడినది. నృసింహ మంత్రరాజములోని ఏకాదశ పదములచే హనుమంతుడు శ్రీరాముని స్తుతించెను. అనగ అవతారములయందు హనుమంతునకు భేదదృష్టి లేదు ఇదిగాక వేదమాతయైన గాయత్రియు, వేదార్థ ప్రతి పాదకమైన భాగవత పురాణమునందలి ఆదినారాయణుడు ఒక్కటేనని ముందుగా నిరూపించితిని.
భేదదర్శనముగల భక్తులెట్లు శిక్షింపబడిరో చుడుడు. హిరణ్య కశివుడు బ్రహ్మను కొలిచి విష్ణువును ద్వేషించెను. రావణు డీశ్వరుని కొలిచి విష్ణువును ద్వేషించెను. దక్షుడు విష్ణువును కొలిచి ఈశ్వరుని ద్వేశించెను. చిత్రకేతుడు విష్ణుభక్తుడై ఈశ్వరుని దూషించెను. వీరందరు గుణప్రధానులై దేవతల నారాధించి భేదదర్శనులై శిక్షింపబడిరి. గుణాతీతుడైన పరమేశ్వరుడే ఆదినారాయణుడు. "సబ్రహ్మాః సశివః సహరిః సేంద్రః సోక్షరః పరమ స్వరాట్" అని భావించి అభేదబుద్ధితో ధ్యానించవలయును. గుణయుతులైన దేవతల నారాధించి ఇహికసుఖముల బడయవచ్చును. కాని ఆదినారాయుణుని మోక్షా పేక్షతోడనే సేవించవలయును. అందులకే రామరహస్యోపనిషత్తులో
శ్లో|| ఐహికేషుచ కార్యేషు మహా పత్సుచ సర్వదా
నైవయోజ్యో రామమంత్రః కేవలం మోక్షాసాధకః
ఐహికే సమనుప్రాప్తే మాంస్మరే ద్రామ సేవకమ్ ||
రామ రహస్యోపనిషత్తు
ఐహికములైన కోర్కెల తీర్చమని శ్రీరాముని వేడరాదు. కేవలము మోక్షమునే కోరవలయును. ఐహికములైన కోర్కెలు సిద్ధించుటకు రామసేవకుడనైన నన్ను భుజింపుము.
గోపన్న అందుకే "మ్రొక్కిన నీ కెమ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ ఈవలెన్" అని శ్రీరాముని గూర్చి వేడుకొనెను. పోతన "శ్రీకైవల్యపదంబు జేరుటకునై" చింతించెను.
భాగవతములోని గజేంద్రుడు పూర్వజన్మమున ఇంద్రద్యుమ్నుడనురాజు. అతడు ద్రవిడ దేశాధీశ్వరుడు. విష్ణుభక్తుడైన ఆ రాజు అవసానకాలమున "హరి హరి" యనుటకు బదులుగ "హర హర" యని పలికెను. అందువలన అతడు శ్రీప్రదమైన శివపదమును (కైలాసమును) జేరెను. అతనికి వృషభవాహనారూఢుడై శివుడు దర్శన మిచ్చెను. "నేను వైకుంఠమును జేరక కైలాసము నేల జేరితి" నని ఇంద్రద్యుమ్నుడు ప్రశ్నించెను. దానికి బందులుగా శివుడు "నేను లేని విష్ణువులేడు. విష్ణువులేని నేనులేను. నీకోరిక తెలుపు" మని అడిగెను. "నాకు మోక్షము కావలె" నని రాజు కోరెను. నీవు ఘటికాచల క్షేత్రమున నరసింహస్వామిని సేవించిన బ్రాహ్మ మోక్షములు సిద్ధించునని శివుడు తెలిపెను. పై కథలో కూడ శివకేశవ అభేదము తెలుపబడినది.
శ్రీ నృసింహ తాపిని ఉపనిషత్తున శ్రీ నృసింహస్వామియే పరమాత్మ అతని బీజము, ప్రణవము. అతని పరిచారిక దేవతలు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు. సర్వేదేవతలు చరాచరప్రపచంము అంతయు నృసింహా పరమాత్మయేనని ఉపనిషత్తులోని తనూమంత్రమలు తెలుపుచున్నవి.
యోహపై నృసింహోదేవో భగవాన్ యశ్చ బ్రహ్మాతసై#్మపై
నమోనమః
" యశ్చవిష్ణుః "
" యశ్చమహేశ్వరః "
" యశ్చపురషః "
యా సరస్వతీ, యా శ్రీః, గౌరీ, యా ప్రకృతిః యా విద్యా యశ్చోంకారః తుదకు యశ్చ సర్వం అని 32 తనూమంత్రములలో భగవంతుడు విశ్వాకారుడని తెలుపబడినది.
పై విధముగా ఏ దేవతను ప్రార్థించినను సర్వ మతడే అను అభేద భక్తితో ధ్యానింపవలెను. ఈ అభేదభక్తియే అనన్యభక్తికి దారి తీయును.
అనన్యభక్తి:
శ్లో|| అనన్యా శ్చింతయంతో మామ్ యోజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహామ్
గీత 9-22
ఇతర చింతలు లేక ఏ జనులు నన్ను చింతించుచు సేవించుచున్నారో నన్నే గతిగా తలంచుచున్నారో ఆ జనులయొక్క యోగక్షమములను నేనే మహించుచున్నాను.
యోగ=అప్రాప్తస్య ప్రాపణం
క్షేమ= తద్రక్షణం
ఉ|| చక్కెరమాని వేము దినజాలని కైవడి మానవాధముల్
బెక్కురు బక్కదైవముల వేమరు కొల్చెద రట్ల కాదయా
మ్రొక్కిన నీకె మొక్కవలె. మోక్ష మొసంగిన నీవ ఈవలెన్
తక్కిన మాటలేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ!
అని గోపన్న చెప్పిన మాటలలో బక్కదైవములనగా గుణాత్మకులై న దేవతలు. వారు ఐహిక వాంఛలనే తీర్చగలరు; మోక్షమొసగుటకు సర్వము తానైన ఆదినారాయణుడే కావలెను. అతని మాయా విభూతులే గుణమయులగు దేవతలు. అందువలన నిర్గుణుడైన ఆదినారాయణుని సగుణరూపమన ప్రార్థించిన యోగక్షేమములు మోక్షము రెండును. లభించును. ఏ పేరుతో ఆరాధించినను సర్వులు అతని అంశ##లేననిభావించి అభేదబుద్ధితో అరాధించిన అది అనన్యభక్తియగుచున్నది. ఎందుకనగా సర్వదేవతలు పరమాత్మ మాయా విభూతులే. అందులకే త్యాగరాజు "ఉండేది రాముడొకడే ఊరక చెడిపోకె మనసా" అని ప్రబోధించుకొన్నాడు.
ఇట్టి అనన్యభక్తి ఏర్పడువరకు గజేంద్రునకు విముక్తి కలుగలేదు. గజేంద్రుడు సంసార సముద్రమునబడి అరిషడ్వర్గము అను మకరిచే పట్టవడెను. మకరము బారినుండి తప్పించుకొనుటకు ఏండ్లతరబడి ప్రయత్నించినను వీలు కాలేదు. స్వశక్తి నిష్ప్రయోజన మయ్యెను. అతడు మొఱపెట్టుకొన్నను గుణాత్మకులైన దేవతలు అతనిని రక్షింప జాలరైరి.
గీ|| విశ్వమయత లేక వినియు నూరకయుండి
రంబుజాసనాదు లడ్డపడక.
భాగవతము 8-94
"అన్యధా శరణం నాక్తి" యని గజేంద్రుడు తుదకు విశ్వమయుడైన పరమాత్మను, ఆదినారాయణుని అనన్య భక్తితో ప్రార్థించెను. ఆ భగవంతుడు సర్వము తాన యైనవాడు.
ఉ|| ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపలనుండు లీనమై
ఎవ్వని యందు డిందు, పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
é బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
భాగవతము 8-73
సృష్టిస్థితిలయ కర్తను, మూలకారణమైన వానిని ఆది మధ్యాంతరహితుని, సర్వాత్మకుని, ఆత్మరూపుని శరణువేడెను. భగవంతుడు సుదర్శనముచే మకరమును ఖండించి జీవుడైన గజేంద్రుని సంసారసముద్రమునుండి తరింపజేసెను. మోక్షము పరమాత్మ యధీనముననే యున్నదని గజేంద్రమోక్ష కథవలన తెలియుచున్నది.
అత్యంతికభక్తి :
భాగవతమున కపిలుడు ఆత్యంతిక భక్తి యోగము నిట్లు నిర్వచించెను.
"శ్రీమన్నారాయణుని బాయక నిర్హేతుకముగ తద్వ్రత్తెక చిరతరభక్తితో నిష్కాముడై భక్తుడు సాలోక్య సారూప్యసాయుజ్యములను బొందగలడు. కావున మహాత్ములైనవారు నిజ మనోరథ ఫలదాయకంబు లయ్యును మదీయ సేవా విరహితంబులైన ఇతర కర్మంబుల నాచరింప నొల్లరు. దీని నాత్యంతిక భక్తి యోగంబని చెప్పుదురు."
భాగవతము 3-958
ఇట్టి భక్తియే మోక్షమును గూర్చును. భక్తి నిర్హేతుకముగను నిష్కామముగను ఉండవలెను. భక్తుడు తన ఇంద్రియముల తృప్తి పరచుటకై నిజమనోరథ ఫలదాయకములైన కర్మలను వదలి భగవత్సే మాత్రమే త్రికరణశుద్ధిగా జేయవలయును. అట్టివానికి సాలోక్య సారూప్య సాయుజ్యముక్తులు లభించును.
ఆత్యంతిక భక్తి యని నామకరణము చేయక పోయినప్పటికిని గీతలో ఈ అభిప్రాయమే చెప్పబడినది.
శ్లో|| మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు.
గీత9-34
నాయందే మనస్సు నిలుపుము. దారా పుత్రాదులయందు నిలు పకుము. నాయందే భక్తి కలవాడవు కమ్ము, భూతాదుల ఎడ భక్తికల వాడవు కాకుము. నన్ను గూర్చి యోగము సేయుము. ఇంద్రాదులను గూర్చి చేయకుము. నన్నే నమస్కరింపుము. నాకంటే వేరను బుద్ధితో దేనికి నమస్కరింపకుము. ఇట్లు మత్పరాయణుడవైన సర్వాంతరాత్మనగు నన్నే పొందగలవు.
శ్లో|| మత్కర్మకృ న్మత్పరమో మద్భక్త సంగ వర్జితః
నిర్వైర స్పర్వ భూతేషు యస్సమామేతి పాండవ!
గీత 11-55
ఎవడు నా కొఱకు సత్కర్మలుజేసి నేనే పరమ శరణ్యమని నమ్మి నాయందు భక్తి గలవాడై దేనియందును సంగము లేకయుండి ఏప్రాణియందును వైరబుద్ధిలేక ఎవడుండునో అతడే నన్ను బొందును. కాని అన్యులు బొందజాలరు.
శ్లో|| యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్
యత్తపస్సపి కౌన్తేయ! తత్కురుష్వ మదర్పణమ్ ||
గీత 9-27
దేహయాత్రకు వలయునట్టి లౌకికకర్మ ఏది చేయుచున్నావో దేహధారణము కొరకు ఏది హోమము చేయుచున్నావో ఏది దానము చేయుచున్నావో అది నా కర్పణము చేయుము.
పరాభక్తి :-
దేవీగీతలో ఆత్యంతిక భక్తియే పరాభక్తి అని చెప్పబడినది. కొందరు దీనిని ఏకాంతభక్తి అని యందురు.
శ్లో|| అధునా పరభక్తింతు, ప్రోచ్యమానాం నిబోధమే
మద్గుణ శ్రవణం నిత్యం మమ నామాను కీర్తనమ్
కల్యాణగుణ రత్నానా మాకరాయాం మయిస్థిరమ్
చేతనో వర్తనంచైవతైలధారాసమం సదా
దేవీగీత 6-11,12
ఎల్లప్పుడు నా గుణ గాధలను వినుట, నా నామములను పలుకుట, అఖండముగా తై లధారవలె నాయందు చిత్తము నిలుపుట అను నది పరాభక్తి. ఇట్టి భక్తునకు మోక్షాపేక్షయు నుండదు. "మోక్షముమదిగోర నొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై " "నిర్హేతుకమైన భగవత్సేవ ముక్తి కంటె గరిష్ఠంబు" అను భావగత వచనములలో భక్తునకు మోక్షాపేక్షకూడ లేకపోవుటకు కారణమేమి ?
శ్లో|| హేతుస్తు తత్ర కోవాపి నకదాచి ద్భవేదపి
సామీప్య సార్హి సాయుజ్య సాలోక్యానాం నచైషిణా||
దేవీగీత 6-13
ఇట్టి భక్తికి ప్రతిఫలప్రాప్తి ఉద్దేశ ముండదు, సాలోక్యసాయుజ్య సామీప్య సారూప్యములను నాలుగుతెరగుల ముక్తియు కోరడు. భక్తుడు నాపై ప్రేమచేతనే నన్ను సేవించును.
శ్లో|| మత్సేవాతో7ధికం కించిత్ నైవజానాతి కర్హిచిత్
సేవ్య సేవకతా భావాత్ తత్రమోక్షం న వాంఛతి
దేవీగీత 6-14
నా సేవకన్న గొప్పదగు వస్తువు నా భక్తుడెరుగడు. సేవ్యసేవక భావమునువదలి స్వ స్వరూపావస్థాన మనెడి నాసేవనే కోరును. క్రియాసాధ్యమగు మోక్షమును కోరడు.
అఖండ చైతన్యము తానను భావన కలిగియుండును. సేవ. సేవించబడునది, సేవించువాడను త్రిపుటి యుండదు. ఇంద్రియమనో బుద్ధుల నతిక్రమించిన వానికి కర్తృత్వ ముండదు మోక్షము నెట్లు కోరగలడు ? ఎవనికి జగమే గోచరించదో వాడేకాక తక్కినదేమియు నుండదు. మోక్షము సహజము. మనము బద్ధులమును భావన వదిలించుకొన్న చాలును. అది వదలిన కోర్కెగాని భావనగాని ఉండదు. మోక్షమును పొందవలెనను కోర్కె కలిగినను బంధమే అని భావించవలెను. మోక్షనిరపేక్ష స్వాంతుడైనప్పటికిని, పరాభక్తునకు మోక్షము సిద్ధించునని భాగవతము తెలుపుచున్నది.
మ|| కణకన్ వారలు వెండి మోక్షనిరపేక్ష స్వాంతులై యుండి తా
మణిమాద్యష్ట విభూతి సేవితము, నిత్యానంద సంధాయియున్
గణనాతీతము, నప్రమేయము, సమగ్ర శ్రీకమున్, సర్వల
క్షణ యుక్తంబును, నైనమోక్ష పదవింగైకొందు రత్యున్నతిన్
భాగవతము 3-380
శ్లో|| తదైవ తస్స చిన్మాత్రే మద్రూపే విలయో భ##వేత్
ఎవనికి పరాభక్తి కలుగునో వాని చిత్తము నాయందు లయించును,
శ్లో|| భ##క్తేయా పరాకాష్ఠా సైవ జ్ఞానం ప్రకీర్తితమ్
వైరాగ్య స్యచ సీమా సా జ్ఞానే తదుభయం యతః
దేవీగీత 6-28
భక్తి విరక్తుల పరాకాష్ఠయే జ్ఞాన మనబడును. ఎందుకనగా స్వస్వరూప జ్ఞానమున్నచో భక్తియు విరక్తియు సంపూర్ణముగా సిద్ధించును.
"భక్తిః పరేశానుభవో విరక్తి
రన్యత్ర చైష త్రిక ఏకకాలః
ప్రపద్యమా నస్య యధాశ్నతస్యు
తుష్టిః క్షురాపాయో7నను ఘాసం"
భాగవతము 11-2-42
భుజించువానికి, బలము, ఆకలి తీరుట, మనస్సునకు తృప్తి ఏర్పడునట్లే భగవంతుని భజించువానికి ప్రేమయు, ప్రేమాస్పదమైన భగవన్మూర్తి హృదయమున స్ఫురించుటయు, భగవద్ధ్యానమువలన నితరములగు గృహాది విషయములయందు వైరాగ్యమును - ఈ మూడును భజనసేయు ప్రతిక్షణమందు సమముగా కలుగుచు అభివృద్ధి నొందును.
భాగవత కథాశ్రవణము సేయునప్పుడు "అపహృత మనః ప్రాణుడై" భక్తుడు భగవంతునియందు లీనమగును.
ఉప్పుబొమ్మ సముద్రపులోతును జూచుటకు వెళ్ళి తానుగూడ అందులో కరిగిపోవును. అదే విధముగా భక్తుడు పరమాత్మను కనుగొన ప్రయత్నించి ఆ పరమాత్మయే తానని గుర్తించెను.
-రామకృష్ణ పరమాహంస
ఇట్టి పరభక్తని పొందుటకు మార్గము భగవద్గీతలో 18వ అధ్యాయమున చెప్పబడినది.
శ్లో|| బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ
శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషా వ్యుదస్యచ.
శ్లో|| వివిక్త సేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః
ధ్యానమోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః
శ్లో|| అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్
విముచ్య నిర్మమ శ్శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే
భగవద్గీత 51,52,53
పరిశుద్ధమగు బుద్ధితో గూడినవాడై ధైర్యముతో మనస్సును నిగ్రహించి, శబ్దాది విషయములయందు విరక్తుడై రాగదేవేషముల విడిచి, ఏకాన్త స్థలవాసియై, మితాహారుడగుచు, శరీర వాఙ్మనంబుల సాధ్వీన పరచుకొని, ఇహపర భోగములం దాశ##లేనివాడై, నిత్యము ధ్యానయోగాభ్యాస మొనర్చుచు, అహంకారము, బలము, డంబము, కామము, క్రోధము, ద్రవ్య సంపాదనము అనువానిని విడిచి, మమ కారము లేక శాన్తస్వభావముగల పురుషుడు బ్రహ్మభావమును పొందుటకు సమర్థు డగుచున్నాడు.
శ్లో|| బ్రహ్మభూతః ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షితి
సమ స్సర్వేషు భూతేషు మద్భక్తిం లభ##తే పరామ్ ||
గీత 18-54
బ్రహ్మనిష్ఠుడైనవాడు నిర్మలమగు మనస్సు గలవాడై యుండి, దుఃఖించడు. ఏ వస్తువును గోఱడు. సర్వ భూతములయందు సముడై యుండును. అట్టివానికి పరభక్తి లభించును. దానిచే ముక్తి లభించును.
ఇట్టి ఆత్యంతిక భక్తిని త్రికరణశుద్ధిగా అనుష్ఠించిన వారు ప్రహ్లాదుడు, హనుమంతుడు. హనుమంతుడు శ్రీరామదాస్యము తప్ప ఇతరము చేయలేదు.
సీ|| మనమున శ్రీరామ మంతక్రదీక్షయెకాని
ఇతరంబు భావించి ఎరుగవెపుడు
వాక్కుల శ్రీరాము వర్ణించుటేగాని
వేరొండు వర్ణింప నేరవెపుడు
కాయంబు శ్రీరామ కార్యదీక్షకె గాని
ఇతర వృత్తులకు తావియ్యవెపుడు
కర్మముల్ శ్రీరామ ఘన సేవకేగాని
తక్కొరు గొల్వగా తలపవెపుడు
గీ|| మనము వాక్కును కాయంబు మసలెరామ
పరములై ఎవని కట్టి సద్భక్తు డీవ
రామ పదదాస! శ్రీరామ రామరామ
జప సముల్లాస! ఘటికాఖ్యశైలవాస!
-జీవన్ముక్తి మార్గము
శ్లో|| #9; ఇతి భక్తిస్తు యాప్రోక్తా పరభక్తిస్తు సా స్మృతా.
ఇట్టి భక్తినే పరభక్తి యందురు. ఇదియే మోక్షప్రదము. అనగా అనన్యము అభేదము ఆత్యంతికమునైన సాత్వికభక్తియే అనుష్ఠింపదగినది. అహేతుకభక్తి, అనన్యభక్తి, పూర్ణభక్తి ఇవన్నియు జ్ఞానమునకు పర్యాయ పదమలేనని రమణమహర్షి వచించిరి.
నవవిధ భక్తి మార్గములు అత్యంతిక
భక్తి సాధన మార్గము.
"చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!" అని చెప్పిన ప్రహ్లాదుడు ఆత్యంతికభక్తి నలవరచుకొను మార్గమును చక్కగా తెలిపెను. ప్రహ్లాదుడు సూచించిన మర్మము "ఇంద్రియంబు లీశ్వర విషయంబులైన మది సంచిత నిశ్చలతత్త్వమైనచో" అను విదురమైత్రేయ సంవాదములోని వాక్యములో ఇమిడియున్నది. ఇంద్రియములను ఈశ్వరపరము సేయుట ఎట్లు? మనస్సును నిశ్చలము సేయుట ఎట్లు?
మనస్సు పంచేద్రియముల ద్వారా బాహ్యప్రపంచమును గ్రిహించుచున్నది. కన్నులు మంచి దృశ్యములను చూడగోరును. నాలుక రుచిగల పదార్థముల నభిలషించును. చెవి శ్రావ్యమైన గానమును వినగోరును. కావున ఇంద్రియార్థములే కామమునకు మూలము. కామమువలన తక్కిన క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది అరిషడ్వర్గములేర్పుడును. ఇంద్రియములు తమోగుణ ప్రధానములు. మనస్సును బాహ్యవిషయములనుండి మరలింపదలచిన ఇంద్రియముల నియమింపవలయును. భాగవతము ఇంద్రియముల నీశ్వర పరము చేయుమని తెలుపుచున్నది. ముందు చెప్పిన అనన్య అభేద ఆత్యంతికభక్తి చే ఇంద్రియము లీశ్వర విషయములగును. ఇంద్రియము లీశ్వర విషయము లొనర్చనవారిలో చెప్పదగినవాడు ప్రహ్లాదుడు. ఇంద్రియములను ఈశ్వరవిషయములుగ జేయుటకు మార్గమును అతడిట్లు తెల్పెను.
సీ|| కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకునిజూచి చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి.
భాగవతము 7-169
ఇంద్రియము లీశ్వరవిషయములు కానియెడల అవి నిరర్థకములు.
సీ|| కంజాక్షునకు గాని కాయంబు కాయమే
పవన గుంభిత చర్మ భస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే
ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక
హరి పూజనములేని హస్తంబు హస్తమే
తరుశాఖ నిర్మిత దర్విగాక
é కమలేశుజూడని కన్నులు కన్నులే
é తనుకుడ్యజాల రంధ్రములు గాక
చక్రిచింతనలేని జన్మంబు జన్మమే
తరళ సలిల బుద్బుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే
పాదయుగముతోడి పశువు గాక.
భాగవతము 7-170
ఈ మార్గమునే శుకయోగి పరీక్షిత్తునకు తెలిపెను.
సీ|| విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు
గొండల బిలములు గువలయేశ!
చక్రి పద్యంబుల జదువని జిహ్వలు
గప్పల జిహ్వలు గౌరవేంద్ర!
శ్రీ మనోనాథు వీక్షింపని కన్నులు
గేకి పింభాక్షులు గీర్తిదయిత!
కమలాక్షు పూజకుగాని హస్తంబులు
శవము హస్తంబులు సత్యవచన!
హరిపద తుళసీదళామోదరతిలేని
ముక్కు పందిముక్కు మునిచరిత్ర!
గరుడగమను భజన గతిలేని పదములు
పాదపముల పాదపటల మనఘ,
భాగవతము 2-50
సీ|| నారాయణుని దివ్య నామాక్షరములపై
గరగని మనములు గఠిన శిలలు
మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ
మిళితమైయుండని మేను మొద్దు
చక్రికి మ్రొక్కని జడుని యోదలనున్న
కనక కిరీటంబు కట్టెమోపు
మాధవార్పితముగా మనని మానవసిరి
వనదుర్గ చంద్రికా వైభవంబు
కైటభారిభజన గలిగి యుండనివాడు
గాలిలోన నుండి గదలు శవము
కమల నాభుపదము గనని వావిబ్రదుకు
పసిడికాయలోని ప్రాణి బ్రదుకు.
భాగవతము 2-51
బాలకృష్ణుడు మద్ది వృక్షములను పడద్రోయగా శాపవిమోచనము చెందిన గంధర్వులు తమ పంచేంద్రియములు త్రికరణములు ఈశ్వర పరము కావలెనని వరము వేడికొనిరి.
ము|| #9; నీ పద్యావళు లాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్.
నీ పేరంబని సేయు హస్త యుగముల్, నీ మూర్తిపై జూపులున్
నీ పాదంబుల పొంతమ్రొక్క శిరముల్, నీ సేవపై చిత్తముల్.
నీపై బుద్ధులు నాకునిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణా!
భాగవతము 10-408
అట్లే రుక్మిణీదేవియు తన పంచేంద్రియములు శ్రీకృష్ణపరము గావలెనని సందేశము పంపినది.
సీ|| #9; ప్రాణశ! నీ మంజుభాషలు వినలేని
కర్ణ రంధ్రంబుల కలిమి ఏల
పురుషరత్నమ! నిన్ను భోగింపగాలేని
తనులతవలని సౌందర్యమేల
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
ఛక్షురింద్రియముల సత్త్వమేల
దయిత! నీ యధరామృతం బావగాలేని
జిహ్వకు ఫలరస సిద్ధి ఏల
నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణమేల
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల వేయి జన్మలకును.
భాగవతము 10-1709
చెవులు కన్నులు నాలుక ముక్కు చర్మము అనగా పంచేంద్రియములు ఈశ్వర విషయములు కావలెనని పై పద్యభావము. భర్తయే ప్రత్యక్షదైవము కదా?
ఇంద్రియము లీశ్వర విషయము సేయుట అనుకున్నంత సులభసాధ్యముకాదు. నేను రచించిన శ్రీ సతీశతకములో మాతయగు శ్రీ దేవియే శిశువునగు నన్ను అనుగ్రహించి నా పంచేంద్రియముల తనవైపునకు ఆకర్షించు కొనుమని వేడితిని.
ము|| దయతో నన్ను స్పృశించి, పుత్రుడను వాత్సల్యంబుతోజూచి ఆ
పయి నా విన్నపమాలకించి, స్తుతిసంభావ్యంబులౌ పద్య సం
చయ భావామృతమాని, మూర్కొనుము శీర్షం బంతటన్
మామకేం
ద్రియముల్ నీ పరమౌను ధ్యానగతి స్వాధీనంబులై శ్రీ సతీ!
శ్రీ సతీశతకము
దేవీ అనుగ్రహమున్న గాని ధ్యానకాలమున పంచేంద్రియములు ఆమె వరముకావు.
ఇంద్రియనిగ్రహము కష్టసాధ్యమని శ్రీ శంకరాచార్యులుకూడ చెప్పిరి. "బలవా నింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి" విద్వాంసులైనను ఇంద్రియార్థములకు దాసులే. అందులకే శ్రీనృసింహస్వామిని శంకరుడిట్లు ప్రార్థించెను.
శ్లో|| అంధస్య మే హృత వివేక మహాధనస్య
చోరైర్మహా బలిభి రింద్రియ నామధేయైః
మోహాంధకార కుహరే వినిపాతితస్య
లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలంబమ్.
కరావలంబ స్తోత్రము
భాగవతములో ఇంద్రియ నిగ్రహము సూచించుకథ యొకటి కలదు. కుమారుడైన శుకుని వెదకుచు వ్యాసుడు బయలుదేరెను. దారిలో ఒక కొలనులో దేవకన్యలు వివస్త్రలై స్నానము చేయుచుండిరి. యువకుడైన శుకు డావైపు పోవునప్పుడు స్త్రీలు అతనిని జూచి సిగ్గుపడలేదు. వస్త్రములు ధరించలేదు. కాని వృద్ధుడగు వ్యాసుడావై పునకు రాగా వారు సిగ్గుపడి చేలముల ధరించిరి. ఇది వ్యాసునకు విచిత్రముగా దోచెను. భక్తుడైన శుకుడు తన ఇంద్రియముల నీశ్వరపరము జేయుటచేత అన్యవిచారము లేక భక్తి సమాధిలో నిరంతరముండెను. వ్యాసునకు ఇంద్రియని గ్రహము యోగసమాధిలో నున్నంతవరకు మాత్రమే యుండెను. అందులకే నారదు డతనికి భక్తియోగమున బోధించి భక్తిరస ప్రధానమైన భాగవతమును రచింపు మని కోరెను. వ్యాసు డట్లొనర్చి తరించెను.
తరల శుకుడు గోచియులేక పై జనజూచి తోయములందు ల
జ్జకు జలించక చీరలొల్లక చల్లులాడెడి దేవక
న్యకలు హా శుక! యంచు వెన్కజనంగ వ్యాసుని జూచి యం
శుకములన్ ధరియించి సిగ్గున స్రుక్కి రందరు ధీనిధీ!
భాగవతము 1-77
మ|| మరియు నగ్నుండు దరుణుండునై చను కొడుకుంగని వస్త్ర
పరిధానం బొనరింపక వస్త్రధారియు వృద్ధుండునునైన తనుం
జూచి చేలంబుల ధరియించు దేవ రమణులం గని వ్యాసుండు
కారణం బడిగిన, వారలు "నీ పుత్రుండు స్త్రీపురషు లనియెడి
భేదదృష్టి లేకయుండు. మఱియు నతండు నిర్వికల్పుండుగాన
నీకు నతనికి మహాంతరంబు గల" దనిరి. భాగవతము 1-78
శుకుడు 16 సంవత్సరముల వయస్సు గలవాడు.
ఆ|| ఆ మహాత్ము షోడశాబ్ది వయోరూప
గమనగుణ విలాస కౌశలములు
ముక్తి కాంత సూచి మోహితయగు నన
నితరకాంత లెల్ల నేమిచెప్ప!
భాగవతము 1-518
ఇంద్రియని గ్రహముచే అనగా ఇంద్రియముల నీశ్వరపరము చేసిన మందాధికారి మధ్యమాధికారియగును. శాంతిలభించును. తర్వాత మనస్సు నిలుపుటకు కపిలుడు అవయవయోగమును తెలిపెను. తల్లియైన దేవహుతికి కపిలుడు ఆత్మనాత్మ విచారరూపమైన సాంఖ్యయోగమును తెలుపగా ఆమె తనకు బోధపడలేదని తెలిపెను.. అపుడు కపిలుడు అవయవయోగమును వివరించెను. ఇది పామరజన సాధ్యమగు సులభ##మైన యోగము. మనోనిగ్రహమునకు దారితీయును.
మ|| విమలంబై పరిశుద్ధమై తగు మనో విజ్ఞాన తత్త్వ ప్రబో
ధమతిన్ నిల్ప, తదీయమూర్తి విభవ ధ్యానంబు గావించి, చి
త్తము సర్వాంగవిమర్శన క్రియలకున్ దార్కొల్పి, ప్రత్యంగమున్
సుమహాధ్యానము సేయగా వలయుపో శుద్ధాంత రంగంబునన్
భాగవతము 3-927
అనగా శ్రీహరి అవయవముల ధ్యానించి ఒక్కొకటిగా మనస్సున నిలిపికొని తుదకు దివ్యమంగళ విగ్రహమును పూర్తిగా ధ్యానించిన మనస్సు ఏకాగ్రత చెందును. భాగవతపాత్రలలో కొన్ని భగవద్రూప భావన చేయును. కొన్ని భగవత్తత్త్వభావన చేయును. దేవీగీతలో అవయవయోగము చక్కగా వివరింపబడినది.
శ్లో|| ఇదానీం ధారణాఖ్యంతు శ్రుణు ష్వావహితో మమ
దిక్కాలా ద్యవచ్ఛిన్నం దేవ్యాం చేతో నిధాయచ
తస్మయోభవతి క్షిప్రం జీవ బ్రహ్మైక్య యోజనాత్
అష్టాంగయోగ నిరూపణమున వాయుధారణ చెప్పబడినది. దిక్కులు కాలము మొదలగు వానితో పరిమితి నొందని పరమేశ్వరి యగు నాయందు చిత్తము నిలిపి జీవ పరమాత్మల కేతత్వము భావించుటవలన సాధకుడు శీఘ్రముగా తన్మయుడగుచున్నాడు.
శ్లో|| అధవా సమలం చేతో యతి క్షిప్రం న సిధ్యతి
తదా వయవయోగేన యోగీ యోగాం త్సమభ్యసేత్
చిత్తము మాలిన్యము కలదగుటవలన నిరుపాధికమగు నాయందు నిలుకడ కలుగదేని అవయవములు నా కున్నట్లు భావించవలెను.
శ్లో|| మదీయ హస్త పాదాదా వంగేతు మధురే నగ!
చిత్తం సంస్థాపయే న్మంత్రీస్థానస్థాన జయా త్పునః
విశుద్ధ చిత్త సర్వస్మిన్ రూపే సంస్థాపయే న్మనః
అతి సుందరములగు నాపాదములు మొదలగు అవయవములలో నొక్కదానిని చిత్తమున నిలిపి చిత్తమునకు స్వాధీనమైన పిదప మరియొక అవయవమునందు చిత్తము నిలుపవలయును. ఇట్లు ఒక్కొక్క అవయవమును ధ్యానించి నా సంపూర్ణాకృతిని భక్తితో ధ్యానించవలయును. చిత్తగతములైన రాగద్వేషములు, కామాదాలు, అవిద్య, చాంచల్యము, మున్నగు దోషములు తొలగును, తరువాత మంత్రాభ్యాస యోగాభ్యాసములచేత మనస్సును నాయందు లయింపజేయవలయును. ఇట్టి సాధనవలన ఏకాగ్రత లభించి మనోవిక్షేపము రజోగుణము నశించును. మందాధికారి ఉత్తమాధికారి యగును. శుద్ధసత్వ మేర్పడును.
శుద్ధసత్వ మేర్పడగా సమబుద్ధి లభించును. సమబుద్ధిని ప్రాసాదించుమని ఒక కవి ఎట్లు చమత్కారముగా ప్రార్థించెనోచూడుడు.
సీ|| మానావమానము లే నొక్క తెరగుగా
నెంచునాడేల నీ హితము నాకు
కష్టంబు సుఖము నొక్కవిధంబుగా సమ్మ
é తించునాడేల నీ దిక్కునాకు
కాంచనంబును మంటిగడ్డయునొకటిగా
గాంచునాడేల నీ కలిమినాకు
తానంచ పరుడంచు తలపోయుబుద్ధిన
é శించినాడేల నీ చేత నాకు
అట్టి సమబుద్ధి నాకు అలవడుట వరకె
ఏనుగోరుట నీవు నా కిచ్చుటయును
ఆవల నీకిత్తు బుచ్చుకొమ్మన్న నాకు
వలదు పొమ్మందు నిది నీవు తెలిసకొనుము.
é -పరమేశ్వర శతకము
భక్తునకు స్థితిప్రజ్ఞుస కుండవలసిన సమబుద్ధి పై పద్యములో తనకులేదని చెప్పబడినది.
అందులకే "మనసేకాగ్రము సేయుటెక్కువ, కర్మములు జ్ఞానతపములు తక్కువ" అన్నారు.
ఇంద్రియ మనోనిగ్రహమును "సర్వ ధర్మాన్ పరిత్యజ్య" అను భగవద్గీతా వాక్యము సూచించునని కొందిరి అభిప్రాయము. ఇంద్రియధర్మములు లేక వృత్తులను అనగా కామక్రోధాదులను తమోగుణమును మనోవృత్తులైన విక్షేప రజోగుణములను - తొలగించి భగవంతుని శరణు పొందవలెనని భావము. కాని భాగవతము సర్వ ధర్మములను భగవదర్పణ చేయవలయునని సూచించుచున్నది.
"మత్సమర్పిత సకల ధర్మ స్వభావ
మహిమములు గల్గి యితర ధర్మముల విడిచి
సమత వర్తించు నప్పుణ్యతముడు ఘనుడు"
భాగవతము 3-969
ఇంద్రియ మనంబుల నిగ్రహించుటకు భాగవత మొక నూతన మార్గమును సూచించినది. ఆ మార్గము ప్రహ్లాదుడు తెల్పిన నవవిధభక్తుల ననుసరించుట.
శ్లో|| #9; శ్రవణం కీర్తనం విష్ణోఃః స్మరణం పాదసేవనమ్
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్ ||
అని తొమ్మిది విధములైన భక్తులు చెప్పబడినవి. నవవిధభక్తులు వేదమునుండియే గ్రహించబడెనని ఒక వ్యాసమున క్రింది విషయములను పరికించితిని.
1) శ్రవణము:- భద్రం శ్లోకం శ్రూయాసం
భగవంతుని కల్యాణ గుణములు వినగోరుచున్నాము.
2) కీర్తనము :- విష్ణోర్నుకం వీర్యాణి ప్రోవోచమ్
విష్ణమూర్తి పరాక్రమ గాధలు ప్రవచింపగోరుచున్నాము.
3) స్మరణము :- మనామ హే చారుదేశ్య నామ
పరమాత్మ వై భవోత్కర్ష స్మరింపవలెను.
4) పాదసేవనము:- జుషాణ ఇంద్ర సప్త భిర్న ఆగహి
ప్రభూ! నీ రాజఠీవితో మా కడకు విచ్చేయుదువుగాక.
5) అర్చనము:- అర్చా చక్రాయ శాకినే
ఇంద్రునకు అర్చన సమర్పించ దగును.
6) వందనము:- వందా మహేత్వా
నీకు అభివాదములు.
7) ద్యాసము:- వైశ్వానరస్య సుమతే స్యామ
మనము విశ్వశిల్పి ప్రాభవములో ఆణగియుండ దగును.
8) సఖ్యము:- మరు త్వరతం సఖ్యాయ హవామహే
సకల దేవతల అధినేత సఖ్యము అర్థించెదముగాక.
9) ఆత్మనివేదనము:- భర్గో దేవస్య ధీమహి
పరాత్పరుని తేజముమ ధ్యానింతము.
ఆత్మనివేదనము అను పదమునకు ఆత్మార్పణము అను అర్థము వ్రాయక ఆత్మని +వేదనము=ఆత్మలో నెఱుక యను నర్థమును పోతన వ్రాసెను. భాగవతమున నవవిధ భక్తులను త్రికరణశుద్ధిగా జేయవలయునని ప్రహ్లాదుడు. తెలిపెను.
మ|| తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయన్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్‌నమ్మిస
జ్జనుడైయుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
భాగవతము 7-167
"తను హృద్భాష" లనగా మనో వాక్కాయములతో త్రికరణశుద్ధిగా నవవిధ భక్తుల ననుష్ఠించవలయును. భాగవతములో సత్పురుషు డెవడనగా మనసులో తలంచినదానిని నోటితో చెప్పి దానినే ఆచరించువాడని నిర్వచనము చెప్పబడినది. దుష్టు డెవడనగా, మనసులో నొకటిదలచి నోటితో నింకొకటి చెప్పితుదకు వేరొకటి చేయు వాడని నిర్వచనము. అందువలన నవవిధ భక్తి మార్గములను త్రికరణ శుద్ధిగా ఆచరించవలెనని ప్రహ్లాదుడు నియమించెను.
ఇంద్రియముల నీశ్వరపరము జేయుటకు శ్రవణము చెవితోను, దాసత్వము వందన అర్చనము చేతులతోను, సంకీర్తనము నాలుకతోను చేయవలయును. మది నిశ్చలతత్వ మగుటకు సఖ్యము చింతనము ఆత్మలో నెఱుక మనస్సుతో చేయవలయును. పై విధముగా త్రికరణ శుద్ధిగా నవవిధ భక్తి మార్గముల ననుష్ఠించిన ఇంద్రియము లీశ్వరవిషయములై మనస్సు నిశ్చల మగును. రజస్త మోగుణ పరిహారిణియగు భక్తి సంభవించును. ఇదియే భాగవత భక్తి రహస్యము.
సంసార మగ్నుడైన మానవునకు మనస్సును భగవంతునిపై లగ్నమొనర్చుట కష్టసాధ్యము. అభ్యాస పాటవమునను వైరాగ్యమునకు ఏకాగ్రత సిద్ధించును.
వలపుల్ కింకలు రోగముల్ ఋణములున్ వాంఛాశతంబుల్ సుఖం
బులు దుఃఖంబులు తప్పులొప్పులు నిజంబుల్ మోసముల్ దోషముల్
కలతల్ గూర్చెడి జీవితంబున వృధా కాలంబు వెచ్చించు నా
తలపుల్ నీపయి నిల్పనెట్లగు మహాత్మా శ్రీ నృసింహేశ్వరా!
-సువర్ణమాల
నవవిధ భక్తులతో తరించిన భాగవతులు అనేకులు కలరు.
శ్లో|| శ్రీవిష్ణోః శ్రవణ పరీక్షి దభవత్, వైయాసికః కీర్తనే
ప్రహ్లాదః స్మరణ, తదంఘ్రిభజనే లక్ష్మీః పృథుః పూజనే
అక్రూర స్త్వభివందనే, కపిపతిః దాస్యేచ, సఖ్యేర్జునః
సర్వస్వాత్మ నివేదనే బలి రభూత్ కృష్ణాప్తి రేషాఫలమ్.
భాగవత కథను శ్రవణము చేయుటచేత పరీక్షిన్మహారాజును, నామ సంకీర్తనము మాత్రము శుక నారదాదులను, నిరంతర స్మరణమువలన ప్రహ్లాదుడును, పద సేవనమువలన లక్ష్మియును, భగవదర్చనమువలన పృధుచక్రవర్తియును,వందన సమర్పణమువలన అక్రూరుడును, నిరంతర దాస్యమువలన ఆంజనేయుడును, శ్రీకృష్ణుని సఖుడుగా అర్జునుడను, తన సర్వస్వమును ఆత్మనై వేద్యముగా సమర్పించిన బలిచక్రవర్తియును కృతార్థులైరి.
కాంతపైని ఆశ కనకంబుపై ఆశ:
మానవుడు ప్రకృతికి బద్ధుడై సత్త్వరజస్తమోగుణములకు బద్ధుడై కాంతపైని యాశ కనకంబుపై ఆశ మానలేడు. వీనిని తొ లగించుకొన్నగాని భక్తి భావ మేర్పడదు. భగవంతునియందు నిర్వ్యాజమైన ప్రేమ ఏర్పడినగాని ఆశ నశించదు. అందులకే పోతన
శా|| ఆశాపాశము తా కడున్ నిడుపు లేదంతంబు, రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు సే కూడియున్
గాసిం బొందిరి గాక వైన్యగయ భూకాంతాదులున్, అర్థ కా
మాశన్ బాయగ నేర్చిరే? మును నిజాశాంతంబులన్ జూచిరే?
భాగవతము 8-575
ఆ|| కాము గెలువవచ్చు గాలారిగావచ్చు
మృత్యుజయము గల్గి మెఱయవచ్చు
నాడు వారిచూపు టంపఱ గెలువంగ
వశముగాదు త్రిపుర వైరికైన
భాగవతము 8-405
ఈ ఆశను వదలుట కష్టతరమని చిత్రమైన కథను చెప్పుదురు.
పూర్వము బ్రహ్మదేవుడు అనేక జీవరాసులను అనేక వస్తువు లను సృష్టిజేసెను. ఆయన సృష్టించిన వన్నియు మానవులు ఉపయోగించుచున్నారు. కాని రెండు వస్తువులు మాత్రం ఎవరు కోరలేదు. వానిలో మొదటిది నిధనం" అను పేరు గలది. "నిధనం" అనగా "మృత్యువు" అని అర్థము. దీని నెవ్వరు కోరలేదు. సరికదా దాని మాట అనగానే అందరకు భయము కలుగుచున్నది. రెండవది "శస్త్రి" అను పేరు గలది. "శస్త్రి" అనగా "కత్తి" అని అర్థము. సుఖముగా అన్యోన్య ప్రేమభావముతో బ్రతుకవలెనంటే కత్తి యొక్క ఆవశ్యకత లేదు.
బ్రహ్మదేవునికి మాత్రము తాను సృష్టించిన వానిలో రెండు ఉపయోగపడక వ్యర్థముగా మిగిలిపోవుట ఎంతమాత్రము గిట్టలేదు. ఎంతో కృషిచేసి తయారుచేసిన వస్తువులు ఉపయోగపడక పోయిన ఎడల తాను చేసిన కష్టము వ్యర్థమయ్యెనని మనస్సునకు బాధ సహజముగా కలుగునుకదా. ఎవరికి ఉయోగపడని వానిని తయారు చేసితినే" అని బ్రహ్మకు చింత మొదలయినది. దానిలో అన్నపానీయాలు కూడా అతనికి రుచించలేదు. వాటి నెట్లు ఉయోగపడునట్లు చేయుట యా అని దీర్ఘాలోచనకు మొదలిడెను.
బ్రహ్మదేవుని భార్య సరస్వతి. ఆమె సకల విద్యాస్వరూపిణి. ఆమె తన భర్త మనస్సు కలతబెట్టు విషయమును తెలసికొనుటకై అతనిని సమీపించి సవినయముగా అడిగెను. "స్వామీ! మీరేమి ఆలోచించుచున్నారు. ఈ దాసురాలికి తెలిపినచో మీ చింతను తొలగించుటకు ప్రయత్నించును." అనెను. బ్రహ్మదేవుడు ఆమెను తన చూపుడు వ్రేలితో తాను సృష్టించిన "నిధనం" "శస్త్రీ" అన్న వానిని చూపించెను, ఆమె అతని మనోవేదన గ్రహించెను. అయిన వీటి నెవ్వరు ఉపయోగింతురు? ఆమె ఏమి చేయలేక ఉండిపోయినది.
é ఇంతలో త్రిలోక సంచారియగు నారదమహర్షి అక్కడకువీణపై హరినామ సంకీర్తనము పాడుచు వచ్చెను. నారదుడు బ్రహ్మకొమారుడు. బ్రహ్మ మానసపుత్రుడు రాగానే బ్రహ్మదేవునికి సరస్వతికి నమస్కరించెను. వారు నారదుని దీవించిరి. తరువాత నారదుడు వారి ముఖవైఖరిని పరికించెను. బ్రహ్మదేవుడు విచారిస్తున్నారని కనుపించెను. సరస్వతీదేవియు ఏదో విధముగా అగుపించెను.
నారదుడు బ్రహ్మదేవుని సమీపించి "నాయనా" అనెను. పరధ్యానంలో దీర్ఘాలోచనలో మునిగిన బ్రహ్మ బదులు పలుకలేదు. మరల "నాయనా" అని గట్టిగా పిలిచెను.
"ఏమి" అన్నాడు బ్రహ్మదేవుడు. "మీ మనస్సును కలవరపరచే సమస్య ఏదో చెప్పండి. నేను ప్రయత్నింతును" అన్నాడు నారదుడు.
"కుర్రవెధవ. వీడేమి చేయగలడని భావించి విషయం తెలిపితే అందరకు దానిని తెలిపి తన మానము తీయగలడని బ్రహ్మ అను కొనెను." ఈ విషయము నీతో పరిష్కారం కాదుపోరా" అని తెలిపెను.
కాని నారదుడు తన పట్టుదలను వదలలేదు. తన శక్త్యాను సారము కృషి చేయుదునని మరల అడిగెను. చివరకు బ్రహ్మ ఇట్లు తెలిపెను. నా సృష్టిలో రెండు మాత్రము మానవు లుపయోగించుట లేదు. ఆశించనులేదు. అని "నిధనం" "శస్త్రీ" అనునవి, వానిని ఉపయోగపడునట్లు చేయుటకు ఆలోచించుచున్నాను" అని తెలిపెను.
శ్రద్ధతో విన్నట్లు నటించుచున్న నారదుడు ఒక పర్యాయము కండ్లు పైకెత్తి "నారయణ" అనెను.
"ఇదెంతపని? దీనికి ఒక మంచి ఉపాయము కలదు. నేను చెప్పినట్లు చేసిన ఎడల మానవులందరు వీనినే కోరుదు రనెను."
"చెప్పరా నాయనా" అని బ్రహ్మదేవుడు ఆతురతతో కోరెను.
"మీరు సృష్టించిన "నిధనం" "శస్త్రీ" అను మొదటి అక్షరములు ప్రతిదానిలో తొలగించుడు; ఏమి మిగులునో చూడుడు;" అని నారదుడనెను.
"ధనం. స్త్రీ" అన్నాడు బ్రహ్మ ఆశ్చర్యము నభినయిస్తూ,
పైరెంటిని తప్పక ఆశించెదరు. ఉపయోగించెదరు" అని నారదుడు డనెను.
తక్షణమే బ్రహ్మదేవుడు "నిధనం" "శస్త్రీ" లను "ధనం" "స్త్రీ" లుగా మార్చివైచెను. వీనిని చూడగానే మానవులందరికి ఆశ కలిగెను. అందరి మనస్సులు వానివైపు ఆకర్షింపబడెను. వానికై కత్తులతో పోరాడిరి. తమ సర్వస్వము తుదకు ప్రాణములను కూడ అర్పించిరి. మృత్యువునకు (నిధనం) కత్తికి (శస్త్రీ) పని కల్పింప బడెను. వానిని జనులు పయోగించిరి. నారదుని యుక్తికి బ్రహ్మ దేవుడు సరస్వతి మెచ్చుకొని ఆశీర్వదించిరి.
తరువాత ఒక విచిత్రము జరిగెను. "నిధనం" "శస్త్రీ" లనుండి తొలగింపబడిన "ని" "శ" అను అక్షరములు "మాగతి ఏమని" కూడ బలుకుకొని బ్రహ్మదేవుని కాళ్ళపై పడెను. "స్వామీ ! మాగతి ఏమి" అని వేడుకొనెను. బ్రహ్మదేవునకే తోచలేదు. సరస్వతి వైపు చూచెను. ఆ రెండు సరస్వతి కాళ్ళపై పడెను. సరస్వతిదేవికి కూడ ఏమి తోచలేదు. నారదుని వైపుజూచి "మిమ్ములను తీసి వేయమని చెప్పినది. నారదుడే" అనెను. ఆమాటలు వినగానే అవి నారదుని పాదాలపై పడెను. నారదు డొక పర్యాయము మరల పైకి చూచి "నారాయణ" అనెను. వానిని చూచి మీరు భయపడవలసిన పని లేదు. మీరిద్దరు కలసి ధనమున్నచోటను స్త్రీ ఉన్నచోటను ఉండగలరు. మిమ్ములనెవ్వరు ఆశించకపోయినను మీ ప్రభావ మక్కడ ఎక్కువగా ఉండగలదు." అని నారదుడు పలికెను.
ఆ తక్షణమే "ని" "శ" అను అక్షరాలు తారుమారుగా కలిపి "శని"గా మారినవి. ఆ శని తన ప్రభావమును ధనము స్త్రీ ఉన్న చోట ఎక్కువగా చూపగలిగెను.
నారదుని తెలివికి సరస్వతి బ్రహ్మ ఆశ్చర్యచకితులైరి. "నారాయణ" నామస్మరణము చేయుచూ నారదుడు నిష్క్రమించెను.
కాంతపైని ఆశ కనకంబుపై ఆశ
లేనివాడు పుడమి లేనివాడు -వేమన
భగవంతునే గాక శక్తిని ప్రార్థింపవలయునా?
ఇంతవరకు ఏకేశ్వరుడైన ఆదినారాయణునియందు భక్తి కలిగి యుండ వలెనని తెలిసికొంటిమి. భాగవతము ఏకేశ్వరోపాసన ప్రతిపాదించుచున్నది. కేవలము నారాయణుని ఆరాధించిన చాలునా? ప్రకృతి లేక శక్తిని ఆరాధించ వలయునా? అను సందేహము కలుగవచ్చును.
భగవంతుడు త్రిమూర్త్యాత్మకుడు. త్రిమూర్తులగు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు రజోగుణము సత్వగుణము తమోగుణములను సూచింతురు. వీరు ళక్తులు సరస్వతి, లక్ష్మీ, పార్వతి, సరస్వతి బ్రహ్మవాక్కు నందును, లక్ష్మిదేవి విష్ణువు మనస్సునందును, పార్వతి శివుని సగము దేహమునందు కలరు. అనగా వీరే భగవంతుని మనో వాక్కాయములు వీరిచేతనే అనగా త్రికరణముల చేతనే భగవంతుడు కార్యోన్ముఖు డగుచున్నాడు.
"తన్మనసాభిగచ్ఛతి, తద్వాచా వదతి, తత్కర్మణా కరోతి"
-నృసింహాతాపిని ఉపనిషత్తు
సౌందర్యలహరిలో శక్తి (Dynamic force) లేనిది స్థాణు వైన శివుడు (Static force) కదలనైన జాలడని ఇట్లు తెలిపెను.
శ్లో|| శివశ్శక్తా యుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం
నచే దేవం దేవో నకుశల స్పందితు మపి
-సౌందర్యలహరి
భాగవతమున ధృవుడు తపస్సుచేయుటకై వెడలినపుడు అతని తల్లి "లక్ష్మీ తరుణీమణిచేత వెదుక దగు పరమేశున్" అని ప్రకృతి ద్వారా పురుషుని తెలిసికొన వచ్చునని బోధించెను.ప్రకృతి పురుషుల సంబంధము అవినాభావ సంబంధము. లక్ష్మిదేవి విష్ణువునకు అసపాయిని అనగా విడిచియుండనిది.
శ్లో|| రాఘవత్వే7భవత్ సీతా రుక్మిణీ కృష్ణ జన్మని
సర్వేషు చావతారేషు విష్ణోరేషా నపాయినీ||
అన్ని అవతారములయందును లక్ష్మి భగవంతుని ఎడబాయదు. పరమేశ్వరుని శక్తి సహజ, నిత్య, ధృవ అనుచు శాక్తేయులు శివశక్తుల కభేదము పాటింతురు శ్రీ నరసింహతాపిని ఉపనిషత్తు నర సింహస్వామియే సరస్వతి లక్ష్మీ పార్వతి ప్రకృతిరూపముల నుండునని అభేద ప్రతిపత్తి ని చాటినది.
సత్వ రజస్త మోగుణములచేత ప్రకృతి జీవుని బద్ధుని చేసినది. ఈ గుణముల తొలగించుకొని ఆత్మ సాక్షాత్కారము చెందుటకు శ్రీ దేవిని ప్రార్థింపవలెనని శాక్తేయులు భావింతురు. భాగవతమున త్రిపురదహాన కథ కలదు. త్రిపురము లనగా స్థూల సూక్ష్మ కారణ దేహములు. ఇవి సత్వ రజస్త మోగుణములచే ఏర్పడినవి. ఈ త్రిపురముల అధి దేవతయే త్రిపురసుందరి, లేక మాయ, ప్రకృతి. ఈ మాయయే జీవుని బద్ధుని జేమినది. రజస్తమోగుణమునుండి జనించిన కామ క్రోధాదులే శక్తి ఆయుధములుగా లలితా సహస్రనామమున చెప్పబడినవి. మనస్సు చెరకు విల్లు. ఇంద్రియార్థములకు కారణమైన పంచ తన్మాత్రలే (శబ్ధ స్పర్శ రూప రస గంధములే ) ఆమె బాణములు. వీనితో జీవుని బద్ధుని జేసినది.
"రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా
మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా"
-లలితా సహస్రనామము
ఆమె దయవలన భక్తుడు తమోగుణ రజోగుణములను అనగా ఇంద్రియములు మనస్సును జయించిన శుద్ధ సత్వగుణ మేర్పడును. సత్వగుణముచే జ్ఞానము కలుగును. అందులకే శ్రీదేవి జ్ఞాన ప్రసూనాంబ. కాన త్రిపురాసుర సంహారమనగా త్రిగుణముల జయించి (గుణానేతా న్యతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్) ఆత్మానుభూతి పొందుట యని భావము. సత్వ రజస్తమో గణములను తెరలను తొలగింపు మని త్యాగరాజు కూడ ప్రార్థించెను.
"తెర తీయగ రాదా నాలోని"
భక్తిలో మూడు సోపానములు:-
భక్తుడు దైవముపై చూపు ప్రేమ మూడు సోపానములు కలిగి యుండును.
1) తసై#్యవాహం :- నేను నీ వాడను. ఉదాహరణము - రాతిబొమ్మ నీటితో మునుగునట్లు మునుగుట.
2) మమైవాసౌ:- నీవు నావాడవు, ఉదాహరణము - గుడ్డబొమ్మ నీటిలో మునిగినట్లు లోపల వెలుపల భక్తి భరిత మగుట.
3) త్వమేవాహం :- నీవేనేను. ఉదాహరణము - పటికబెల్లము నీటిలో కరగినట్లు భక్తిలో లీనమగుట అనగా పంటికబెల్లము స్వరూపమును కోల్పోయినట్లే భక్తిని అహంకారము నశించును.
భాగవతములోని "భక్తి విశేషము" :-
భాగవత భక్తిలో నొక విశేషము కలదు. ఏ మార్గముతో గాని, ఏభావముతో గాని ఇంద్రియము లీశ్వరపముజేసి, మనస్సును నతనిపై నిలిపి "ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన" శ్రీహరిని పొందవచ్చునని భాగవతము తెలుపుచున్నది. యశోద వాత్సల్యభక్తినీ, గోపికలు మధుర భక్తిని, రావణాదులు వైరభక్తిని అనుసరించిరి.
శిశుపాలుడును దంతవక్రుండును "హరిసాధింతు హరింగ్రసింతు హరి బ్రాణాంతంబు నొందింతు" నని నిరంతరము శ్రీకృష్ణుని నింద సేయుచుండిరి. వారికి విష్ణు సాయుజ్యం బెట్లు గలిగెనని ధర్మరాజు నారదుని ప్రశ్నించెను. దానికి నారదుడు తెలిపిన వచనములలో భాగవత భక్తి విశేషము గమనింపదగినది.
దూషణ భూషణ తిరస్కారంబులు శరీరంబునకుగాని పరమాత్మకు లేవు. శరీరాభిమానంబునంజేసి దండ వాక్పారుష్యంబులు హింసయై దోచు తెఱుంగున నేను నాయది వైషమ్యంబును భూతంబులకు శరీరంబు నందు సంభవించు నభిమానంబు బంధంబు నిరభిమానుండై వధించినను వధంబు గాదు. కర్తృత్వ మొల్లనివానికి హింసయు సిద్ధింపదు. సర్వ భూతాత్ముకండైన ఈశ్వరునికి వైషమ్యంబులేదు గావున
ఆ|| అలుకనైన జెలిమినైన గామంబున
నైన, బాంధవమున నైన, భీతి
నైన, దగిలి తలప, నఖిలాత్ముడగు హరి
జేరవచ్చు వేఱు సేయ డతడు.
క|| వైరాను బంధనంబున
జేరిన చందమున విష్ణు జిరతర భక్తిన్
జేరగరాదని తోచును,
నారాయణ భక్తి యుక్తి నా చిత్తమునన్,
క|| కీటకము దెచ్చి భ్రమరము
పాటవమున బరిభ్రమింప భ్రాంతంబై త
త్కీటకము భ్రమరూపము
బాటించి వహించుగాదె భయ యోగమునన్.
ఇవ్విధంబున
శా|| కామోత్కంఠత గోపికల్ భయమునన్ గంసుండు వైరక్రియా
సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్
బ్రేమన్ వీరలు భక్తి నేము నిదె చక్రంగంటి మెట్లైన ను
ద్దామధ్యాన గరిష్ఠుడైన హరి జెందం వచ్చు ధాత్రీశ్వరా!
భాగవతము 7-13,14,15,16,17,18
ఆ|| బాంధవముననై న బగనైన వగనైన
బ్రీతినైన బ్రాణ భీతినైన
భక్తినైన హరికి బరతంత్రలై యుండు
జనులు మోక్షమునకు జనుదు రధిప!
భాగవతము 10 పూ. 973
మ|| మధుదైత్యాంతకు మీది మత్సరమునన్ మత్తి ల్లి, జన్మత్రయా é
వధి యేప్రొద్దు దదీయరూపగుణ దివ్యధ్యాన పారీణ ధీ
నిధి ¸°టన్, శిశుపాల భూవిభుడు, దా నిర్ధూత సర్వాఘుడై,
విధి రుద్రాదుల కందరాని పదవిన్ వేపొందె నుర్వీశ్వరా!
భాగవతము 10-799
ఇట్లే కంసుడు రావణుడుకూడ వైరముచేతనే తరించిరి. ప్రేమ వైరము మొదలగు ఏ భావముతోనైనను హరి చింతనము మోక్షదాయకము.
ఎట్టి భావనతో భగవంతుని భజింపవలెను:-
శ్లో|| అహం సర్వస్య ప్రభవో మత్త స్సర్వం-ప్రవర్తతే
ఇతిమత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా ||
గీత 10-8
సర్వమునకు భగవంతుడే కారణము. ప్రపంచ వ్యాపారమంతయు భగవదధీనమున నున్నది. ఆయన లేనిచోటు లేదు. ఆయన సంకల్ప మమోఘమైనది. ఆయన సర్వ శక్తియుతుడు. సర్వమునకు కర్త, సర్వమునకు నియంత, సర్వజ్ఞుడు , సర్వసాక్షి. ఇట్లు తెలిసికొని వివేకులు ప్రీతిభావముతో భగవంతుని సేవింతురు.
శ్లో|| మచ్చిత్తా మద్గుతప్రాణా బోధయన్తః పరస్పరమ్
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతిచ రమన్తిచ
గీత 10-9
నాయందే మనస్సుంచి, నాయందే ప్రాణముంచి, నా చరిత్రలే చెప్పుకొనుచు, తెలిసినవారు నాయందే ఆనందించి నాయందే క్రీడ సల్పుచున్నారు.
నిష్కామ్యముగా ఈశ్వరసేవ చేయువారికి జ్ఞానము కలుగను.
శ్లో|| తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకమ్
దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాన్తితే ||
గీత 10-10
శ్లే|| తేషామే వాను కంపార్ధ మహ మజ్ఞానజం తమః
నాశయా మ్యాత్మ భావస్థో జ్ఞావదీపేన భాస్వతా||
గీత 10-11
కోరికలులేక భక్తిచే నెల్లప్పుడు నా సేవలు చేయు వారలకు. నేనే తగిన పరికరముల నిచ్చి నా యొద్ద చేర్చికొందును. నేనే ఆత్మ జ్ఞానము కలుగజేసెదను.
నా ప్రేమ నిమిత్తమే నన్ను సేవించుచున్నారుగాన నేను వారి బుద్ధియందు ప్రవేశించి జ్ఞానదీపముచే ఆజ్ఞాన మను చీకటిని నశింప జేయుచున్నాను.
పై భగవంతుని వాక్యములను బట్టి జ్ఞాన సహితమగు భక్తి శ్రేయోదాయక మనియు కేవల మూఢభక్తి సంపూర్ణఫలము నియ్యదనియు భావము. భగవంతునకు భక్తునకు భేదభావము నశించును.
శ్లో|| సర్వ భూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః
గీత 6-29
యోగయుక్తుడు అంతటను సమానమగు ఆత్మ ధర్శనము గల వాడగుచు, తాను సర్వభూతముల యందును, సర్వభూతములు తన యందును ఉన్నటులు అనుభవముచే దెలిసికొనుచున్నాడు.
శ్లో|| #9; బహూనాం జన్మనా మన్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవ స్సర్వమితి సమహాత్మా సుదుర్లభః
గీత 7-19
అనేక జన్మములెత్తి జ్ఞానము సంపాదించి, సర్వమును వాసుదేవుడే యని తెలిసి పరమేశ్వరుడగు నన్ను జేరుచున్నాడు. అట్టివాని కెవ్వరును సాటికారు. అట్టి మహాత్ముడు అరుదై యుండును.
"శ్రద్ధావాన్ లభ##తే జ్ఞానమ్" "భక్త్యామామభి జానాతి" అనుట చేత భక్తితో జ్ఞానము సిద్ధించి భగవంతునకు భక్తునకు మధ్య భేద భావము నశించును. దీనినే భాగవతమున
శ్లో|| సర్వభూతేషు యః పశ్యేద్భగవద్భాగ మాత్మనః
భూతాని భగవతాత్మ న్వేష భాగవతోత్తమః ||
నేను వేరు, భగవంతుడు వేరు, లోకులు వేరనుబుద్ధిని మనస్సున నుంచక నేనును భగవంతుడను ఒకటియే అను భావన నెవ్వడు సర్వ భూతముల యందుంచుచున్నాడో వాడు భాగవతులలో శ్రేష్ఠుడు.
పర్యవసానము:-
తుదకు ముఖ్యముగా గమనింపవలసిన దేమనగా పై భక్తిమార్గానుష్ఠానక్రియల నన్నింటిని క్రోడీకరించి సమన్వయపరచి కపిలుడు దేవహుతి కిట్లు తెలిపెను.
సీ|| అంబ! నారాయణు డఖిల శాస్త్రములను
సమధి కానుష్ఠిత సవన తీర్థ
దర్శన జపతపోధ్యయన యోగక్రియా
దాన కర్మంబుల గానబడడు
ఏచిన మనమున బాహ్యేంద్రియంబుల గెల్చి
సకల కర్మత్యాగ సరణినొప్పి
తలకొని యాత్మ తత్త్వజ్ఞానమున మించి
యుడుగక వైరాగ్యయుక్తి దనరి.
గీ|| మహిత ఫలసంగ రహిత ధర్మమున దనరు
నట్టి పురుషుండు తలపోయ నఖిలహేయ
గుణములను బాసి కల్యాణగుణ విశిష్టు
డైన హరి నొందు-
భాగవతము. 3-1026
పై పద్యములో "ఏచిన మనము" బాహ్యేంద్రియంబుల గెలిచి" అను పదముల భావమును పరికించినచో ఇంద్రియ మనోనిగ్రహములు లేదా రజస్తమో పరిహారిణియగు భక్తి భాగవతము ప్రతిపాదించు చున్నదని విశదమగుచున్నది.
మ|| విను మంభోజ భవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మారు నె మ్మనమందుం దలపోసి, యెంతయు బరామర్శించి, మోక్షంబు ద
క్కిన మార్గంబుల వెంట లేదనుచు భక్తిన్ బూజనేసెన్ జనా
ర్దను నాత్మాకృతి నిర్వాకారు డగుచున్. తన్మార్గ నిర్ణేతయై.
భాగవతము 2-35
"నిర్హేతుకమగు భగవత్సేవ ముక్తికంటె గరిష్ఠంబు-లింగ శరిరనాశకంబు గావించు"
భాగవతము 3-877
నిర్హేతుకమైన ప్రమ పూర్ణమైన భక్తినే సమర్థించుచున్నది.
ఇట్టి భాగవత భక్తి మార్గము
"పరమ భాగవతులు పాటించు పథము"
"ఈ గతిని యోగి ఏగెనేని మగడిరాడు వాడు"
అనగా ముక్తి కరతలామలకమని భాగవతము నిస్సంశయముగ తెలుపుచన్నది. భక్తులు మోక్ష నిరపేక్ష స్వాంతు లయ్యును. మోక్ష పదివిని గైకొందురని కపిలుడు తెలిపెను.
మ|| కణకన్ వారలు వెండి మోక్ష నిరపేక్ష స్వాంతులై యుండి తా
మణిమాద్యష్ట విభూతి సేవితము నిత్యానంద సంధాయియున్
గణనాతీతము నప్రమేయము సమగ్ర శ్రీకమున్ సర్వల
క్షణ యుక్తంబును నైన మోక్షపదవిం గైకొందు రత్యున్నతిన్.
భాగవతము. 3-880
భాగవతులు విష్ణు దివ్య పదమును గైకొందురు.
"తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయాః
త ద్విప్రాసో విపన్యవో జాగ్రువాం సః సమిద్ధతే
విష్ణోర్య త్పరమం పదమ్"